తెలంగాణలో మార్పు దిశగా ప్రభుత్వ బడులు

తెలంగాణలో  మార్పు దిశగా ప్రభుత్వ బడులు

 తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలల సంస్కరణ దిశగా ప్రభుత్వం కృషి ప్రారంభం అయ్యింది.  రంగారెడ్డి జిల్లా మంచాల, నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది తెలంగాణ విద్యా కమిషన్ క్యాచ్​మెంట్ ఏరియా బేస్​గా ప్రభుత్వ పాఠశాలల సంస్కరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఈ రెండు మండలాలు పాఠశాలలను క్యాచ్​మెంట్ ఏరియా బేస్​గా  పాఠశాలలు విలీనానికి పూర్తి కసరత్తు చేశారు. ఉత్తర్వులు సైతం విడుదల చేశారు. 

ప్రభుత్వ పాఠశాలల సంస్కరణకు అంకురార్పణ జరిగినట్లే! రెండు మండలాల్లో వచ్చిన ఫలితాలు, అనుభవాలు అనుసరించి మరుసటి ఏడాది ప్రణాళిక అమలు చేయనున్నారు. తెలంగాణా విద్యా కమిషన్ సూచించిన ప్రకారం మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు,  ప్రాథమికోన్నత  పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు,  కేజీబీవీలు,  జూనియర్  కళాశాలలు అన్నింటినీ కుదించి,  క్యాచ్​మెంట్  ఏరియాను దృష్టిలో  పెట్టుకొని మండలానికి మూడు  తెలంగాణ  పబ్లిక్  స్కూల్స్,  నాలుగు తెలంగాణ  ఫౌండేషన్ స్కూల్స్​ను  ఏర్పాటు చేస్తారు.  ఆయా పాఠశాలల బోధన,  బోధనేతర  సిబ్బందిని  ఆయా  క్యాచ్​మెంట్ ఏరియా పాఠశాలలకు  కేటాయిస్తారు.   ఫౌండేషన్  తరగతుల నుంచి ఇంటర్మీడియట్ వరకు  ప్రభుత్వ విద్య తాము కోరుకున్న  పాఠశాలలోనే అందుబాటులోకి రానుంది. 

ట్రాన్స్​పోర్టు  సౌకర్యం

క్యాచ్​మెంట్ ఏరియాలో  పాఠశాల అందుబాటులో లేని  గ్రామాల నుంచి పిల్లలను ఆయా పాఠశాలలకు తరలించడానికి  తొలిసారి  ట్రాన్స్​పోర్టు  సౌకర్యం వినియోగంలోకి తేనున్నారు.  తెలంగాణా విద్యా కమిషన్ సూచించిన ప్రకారం  ఒక్కో మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్వహణకు రూ.12 కోట్లు చొప్పున మూడు పాఠశాలలకు రూ.36 కోట్లు, ఒక్కో తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ కోసం మూడున్నర కోట్ల రూపాయల చొప్పున  నాలుగు పాఠశాలలకు రూ.14 కోట్లు, వెరసి మండలానికి 50 కోట్ల రూపాయలతో  లేబరేటరీలు,  ఆధునిక బోధనా సామగ్రి, ఏఐ, కంప్యూటర్ ల్యాబ్స్ లాంటివి  ఏర్పరచి ఆధునిక లేబరేటరీలు ఏర్పాటు చేస్తారు.  పిల్లలకు ఉదయం అల్పాహారం,  మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ మంచి నాణ్యతతో అందిస్తారు. 

ఈ ఏడాది రెండు మండలాల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ అనుసరించి మరుసటి ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 634 మండలాలలో ఏటా వంద మండలాల పాఠశాలలను ఇదే విధానం అనుసరించి సంస్కరణలు  చేపడతారు. తెలంగాణా విద్యా కమిషన్ సూచనల ప్రకారం వంద మండలాలకు ప్రతిఏటా రూ. 5000 కోట్లు ప్రభుత్వం ఈ పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు బడ్జెట్లో  కేటాయించాల్సి ఉంటుంది.  

 ప్రతిఏటా వంద మండలాల ప్రణాళిక అమలు చేయడం వలన 634 మండలాలు ఆరేండ్ల కాలంలో రూ.31,600 కోట్ల  వ్యయంతో  తెలంగాణలోనిపాఠశాల వ్యవస్థ తెలంగాణా పబ్లిక్,  ఫౌండేషన్ పాఠశాలలుగా పూర్తిస్థాయిలో,  సంపూర్ణ వసతులు, ఆధునిక సౌకర్యాలతో  విద్యా సంస్కరణ పూర్తి కానుంది.

నాణ్యమైన విద్య

తెలంగాణ పబ్లిక్,  ఫౌండేషన్  పాఠశాలల్లో  ఇంగ్లిష్  మీడియంతోపాటు అన్నిరకాల నాణ్యమైన విద్య అందుతుండడం వలన ఎట్టకేలకు ప్రభుత్వ బడి రూపురేఖలు మారిపోనున్నాయి.  ఆధునిక హంగులు సైతం అందుబాటులోకి రావడంతో  ఒకరకమైన నూతన సంస్కరణ ప్రయత్నం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో  మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి.  పాఠశాలల విలీనంతో విద్యార్థులతో కళకళలాడే అవకాశం ఉంది.   పిల్లలు లేని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతోపాటు, వారి బోధనా  నైపుణ్యం  వృథా కాకుండా  కాపాడుకున్నట్లు అవుతుంది.  

కోట్లాది  రూపాయల వేతనాల వృథాసైతం  సంస్కరణ  అమలైతే  ఓ కొలిక్కి వస్తుంది. ఇక  తెలంగాణ  పబ్లిక్ పాఠశాలలో ప్రైవేటు పాఠశాల కంటే మంచి భవనాలు,  సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.  అయితే  పాఠశాల వ్యవస్థ సంస్కరణ, పునర్వ్యవస్థీకరణలతోపాటు  స్థానిక, బయట మానిటరింగ్ విధానం  బలోపేతం చేయవలసిన అవసరం మాత్రం ఉంది.  ప్రభుత్వ పాఠశాల మనుగడ కోరుకునే ప్రజలు, సమాజం పూర్తి సహకారం కూడా అవసరం అవుతుంది.   

ప్రభుత్వ బడుల  సంస్కరణ  పూర్తిస్థాయిలో  అమలు జరిగితే తెలంగాణ  రాష్ట్రంలో ఉన్న  ప్రాథమిక పాఠశాలలు 19వేలు పైచిలుకు,  ప్రాథమికోన్నత  పాఠశాలలు 4వేలు,  ఉన్నత పాఠశాలలు 5వేలు,  రెసిడెన్షియల్ పాఠశాలలు వెయ్యి,  ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 600వరకు,  కేజీబివితోపాటు పలురకాల పాఠశాలలు, కొన్ని అంగన్ వాడీ కేంద్రాలతోసహా ఇక ఉనికిలో ఉండవు. ఇక వాటి స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, సిబ్బందితో  నిత్యం కళకళలాడే తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ 1902, తెలంగాణా  ఫౌండేషన్ స్కూల్స్ 2536 మాత్రమే పాఠశాలలుగా ఉనికిలోకి రానున్నాయి.

విలీనం పారదర్శకంగా జరగాలి

 నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య విద్యాహక్కు చట్టం ప్రకారం అందించడమేకాక, అవసరమైన మౌలిక సౌకర్యాలు సైతం ఇక పాఠశాలల్లో అందుబాటులోకి  రానున్నాయి. అయితే,  పాఠశాలల విలీనం,  సిబ్బంది సర్దుబాటు  విషయంలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా జరగాలి.  

తెలంగాణా పబ్లిక్,  ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటుకు సార్థకత, సానుకూలత లభిస్తుంది.  సిబ్బంది విలీనం సందర్భంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలు ఉద్యోగులు సైతం పెద్దమనస్సుతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.   ప్రభుత్వ బడి సంస్కరణ పూర్తిగా విజయవంతం అయిన పక్షంలో విద్యా రంగంలో  తెలంగాణ మోడల్ అనేది ఇతర రాష్ర్టాలకు, దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.

 సంక్లిష్టం అయిన ఈ విలీన ప్రక్రియకు అందరి ఇష్టంతోపాటు,  ప్రజల నైతిక మద్దతు సైతం అవసరం ఉంది.  ప్రభుత్వ బడి పూర్తిస్థాయి సంస్కరణ దిశగా సాగాలని ఆశిద్దాం.  తెలంగాణ పబ్లిక్,  ఫౌండేషన్ స్కూల్స్ వీలైనంత త్వరగా మనుగడలోకి  రావాలని కోరుకుందాం.  విద్యా సంస్కరణను మనసారా ఆహ్వానిద్దాం.

–ఎన్​. తిర్మల్​, సీనియర్​ జర్నలిస్ట్​–