బందీలు విడుదలయ్యేలా చూడాలి

బందీలు విడుదలయ్యేలా చూడాలి
  • ఇజ్రాయెల్ వ్యాప్తంగా భారీ ఎత్తున పౌరుల నిరసన

` గాజాలో టెర్రరిస్టుల చేతిలో బందీలుగా ఉన్నవారు విడుదల అయ్యేలా చూడాలని ఇజ్రాయెల్  ప్రభుత్వాన్ని డిమాండ్  చేస్తూ ఆ దేశ పౌరులు ఆదివారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ర్యాలీలు తీస్తూ రోడ్లను దిగ్బంధించారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. బందీల కుటుంబాలు, టెర్రరిస్టుల చేతిలో చనిపోయిన వారి ఫ్యామిలీ మెంబర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ రెండు గ్రూపులు ‘డే ఆఫ్  స్టాపేజ్’ పేరుతో ఈ ప్రదర్శలు నిర్వహించాయి. బందీల విడుదలకు ఒప్పందం, చర్చలే మార్గమని, ఇక యుద్ధం వద్దే వద్దు అని ఆందోళనకారులు నినాదాలు చేశారు. 

యుద్ధంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బందీల ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధంలో గెలవలేమన్నారు. రాజకీయ నాయకుల ఇండ్లు, మిలిటరీ హెడ్ క్వార్టర్లు, కీలక హైవేల వద్ద నిరసనకారులు ప్రదర్శన చేశారు. పలు వ్యాపారులు, రెస్టారెంట్  ఓనర్లు ఈ నిరసన ప్రదర్శనలకు సంఘీభావం తెలిపారు. తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అయితే.. పలు చోట్ల ప్రదర్శనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులు ముందుకెళ్లకుండా వాటర్  క్యానన్లు ప్రయోగించారు. మొత్తం 32 మందిని అరెస్టు చేశారు. కాగా.. నిరసన ప్రదర్శనల పేరుతో దేశాన్ని ప్రదర్శనకారులు బలహీనం చేస్తున్నారని నేషనల్  సెక్యూరిటీ మంత్రి ఇతామార్  బెన్  గ్విర్  అన్నారు.