
- 9.80 లక్షల టన్నులకు గాను 5.32 లక్షల టన్నులే ఇచ్చింది: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
- ఇతర రాష్ట్రాల్లోనూ యూరియా కొరత ఉన్నది
- రైతులను బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నరని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కేటాయించిన యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఆదివారం సెక్రటేరియెట్‌లో యూరియాపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ‘‘వర్షాకాలం సీజన్‌కు గాను తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. కానీ అందులో ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది.
ఫలితంగా 2.69 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేటాయించిన 8.30 లక్షల టన్నుల యూరియా కోటాలో 5.32 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చింది. ఇందులో స్వదేశీ యూరియా 3.27 లక్షల టన్నులు, ఇంపోర్టెడ్ యూరియా 2.05 లక్షల టన్నులు ఉంది. రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 78 రోజులు ఉత్పత్తి చేయకపోవడంతో యూరియా సరఫరాలో భారీ లోటు ఏర్పడింది. అదే సమయంలో ఇంపోర్టెడ్ యూరియా సరఫరాలో కొన్ని కంపెనీలు పూర్తిగా విఫలమయ్యాయి.
దీనిపై కేంద్రానికి లెటర్ రాశాం. స్వయంగా సీఎం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలిసి విన్నవించారు. అయినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని మండిపడ్డారు. కేంద్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యూరియా సరఫరా చేసినట్టు అబద్ధాలు చెబుతున్నదని ఫైర్ అయ్యారు. వెంటనే రాష్ట్రానికి కేటాయించిన మొత్తం యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ యూరియా కొరత ఉందని తెలిపారు.
రైతులు అవసరానికి మించి కొనొద్దు..
ఈసారి వర్షాకాలం సీజన్ ముందుగానే ప్రారంభం కావడం, మక్క పంట సాగు పెరగడంతో యూరియా వినియోగం పెరిగిందని తుమ్మల తెలిపారు. నల్గొండ, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పోయినేడాదితో పోలిస్తే ఈసారి యూరియా అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకునేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని రైతులు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని సూచించారు.
ఈ నెలాఖరులోగా నాలుగు నౌకల ద్వారా ఇంపోర్టెడ్ యూరియా రాష్ట్రానికి చేరనుందని మంత్రికి అధికారులు తెలిపారు. ప్రతి నౌక నుంచి అదనంగా 20 వేల టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు.