కర్ఫ్యూ సడలింపు.. ఉదయం, సాయంత్రం 144 సెక్షన్ ఎత్తివేత

కర్ఫ్యూ సడలింపు.. ఉదయం, సాయంత్రం 144 సెక్షన్ ఎత్తివేత

ఇంఫాల్:  కొన్ని రోజులుగా హింసతో అట్టుడికిన మణిపూర్ లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 10 వరకు, సాయంత్రం 3 నుంచి 5 వరకూ కర్ఫ్యూను సడలించారు. అల్లర్ల ప్రభావం తీవ్రంగా ఉన్న చురాచాంద్ పూర్ టౌన్​లో కూడా షాపులు ఓపెన్ అయ్యాయి. ప్రజలు బయటికి వచ్చి మందులు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. మణిపూర్​లో మైతై సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ నాగాలు, కుకీలు మే 3న చేపట్టిన నిరసనలు హింసాత్మకం కావడంతో శనివారం నాటికి 54 మంది మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వెహికల్స్, ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. దీంతో దాదాపు 10 వేల మంది సోల్జర్లు, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. రాష్ట్రంలో ఇంకా బలగాల మోహరింపుతో పటిష్ట భద్రత కొనసాగుతోంది. 

ఆర్మీ క్యాంపులకు 23 వేల మంది 

మణిపూర్ లో ఇప్పటివరకూ అన్ని వర్గాలకు చెందిన 23 వేల మంది ప్రజలను రెస్క్యూ చేసినట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు. బాధితులందరినీ ఆర్మీ క్యాంపులకు తరలించినట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో పరిస్థితి పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిందని చెప్పారు. ప్రధానంగా మైతై వర్గం ప్రజలు ఎక్కువగా ఉండే ఇంఫాల్ వ్యాలీ ప్రాంతంలో డ్రోన్ లు, ఆర్మీ హెలికాప్టర్లతో గగనతలం నుంచి కూడా నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు గాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక శాంతి కమిటీని నియమించనున్నట్లు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చెప్పారు. శనివారం రాత్రి జరిగిన అఖిలపక్ష భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  

స్టూడెంట్ల కోసం విమానాలు

మణిపూర్ లోని ఎన్ఐటీ, ఐఐటీ, సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీలో చదువుతున్న ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు కూడా అల్లర్ల కారణంగా అక్కడే చిక్కుకుపోవడంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని తరలించేందుకు చర్యలు చేపట్టాయి. హెల్ప్ లైన్​లు ఏర్పాటుచేసి, ప్రత్యేక విమానాల్లో రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మణిపూర్​లో తమ స్టూడెంట్లను స్పెషల్ ఫ్లైట్​ను పంపిస్తామని మహారాష్ట్ర సీఎం ప్రకటించారు. తమ స్టూడెంట్లను వెనక్కి తీసుకొచ్చేందుకు ఏపీ, తెలంగాణ, యూపీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి.