
- యావరేజ్ లెక్కలతో పెరుగుతున్న చార్జీలు
- శ్లాబులు మారి కస్టమర్ల జేబులకు చిల్లులు
- బిల్లులు పెంచుకోడానికంటూఆరోపణలు
- ప్రీపెయిడ్ మీటర్లున్నా పట్టించుకోని డిస్కంలు
ఏంటీ సరాసరి విధానం?
బిల్లింగ్ చేసే నెల మొదటి తేదీ నుంచి రీడింగ్ తీసుకోడానికి వచ్చిన రోజు వరకు లెక్కేసి అన్ని రోజులపై ఒకరోజు యావరేజ్ తీసి దానితో 30 రోజులకు బిల్లింగ్ చేస్తున్నారు. దీన్నే సరాసరి విధానం అంటున్నారు. ఇక్కడే చిక్కుంది. బిల్లింగ్ ఆలస్యమైనాకొద్దీ రోజులు పెరిగి యావరేజ్ కూడా పెరుగుతుంది. యావరేజ్ పెరిగితే బిల్లూ ఎక్కువవుతుంది. సాధారణంగా మొదటి రెండు వారాల్లో కరెంటు మీటర్ల రీడింగ్ తీస్తుంటారు. బిల్లు తీసే రోజు వరకు యావరేజ్ కడుతుండటంతో వినియోగదారులపై భారం పడుతోంది.
హైదరాబాద్, వెలుగు: కరెంటు వినియోగదారులకు విద్యుత్ సంస్థలు బిల్లుల మోత మోగిస్తున్నాయి. ‘సరాసరి’ పేరుతో వాళ్ల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. రీడింగ్‌లు ఆలస్యం చేస్తూ అదనపు భారం మోపుతున్నాయి. కస్టమర్ల తెలియనితనాన్ని ‘యావరేజ్’తో వాడుకుంటున్నాయి.
మిడిల్ క్లాస్‌కు దెబ్బ
యావరేజ్ విధానంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. రీడింగ్ శ్లాబ్ దాటి బిల్లులు పెరిగి తంటాలు పడుతున్నారు. సాధారణంగా ఎల్‌టీ 1(బి)(1) శ్లాబ్‌లో 100 యూనిట్ల వరకు రూ.3.30 వసూలు చేస్తారు. ఆ తర్వాత ఒక్కో యూనిట్‌కు రూ. 4.30 చార్జ్ చేస్తారు. కానీ వాడకం 200 యూనిట్లు దాటితే శ్లాబ్ మారిపోతుంది. లెక్క కూడా మారుతుంది. 200 యూనిట్ల వరకు రూ.5, ఆ తర్వాత 201 నుంచి 300 వరకు రూ.7.20, 301 నుంచి 400 వరకు రూ.8.5, 401 నుంచి 800 వరకు రూ.9, ఆ పైన రూ. 9.5 వసూలు చేస్తారు. మిడిల్ క్లాసులో ఎల్‌టీ 1(బి)(1) శ్లాబ్ వాళ్లు ఎక్కువ. కానీ ‘సరాసరి’తో రీడింగ్ పెరిగి రెండో శ్లాబ్‌లోకి వెళ్తున్నామని, దీంతో బిల్లు తడిసి మోపెడవుతోందని హబ్సిగూడకు చెందిన వినియోగదారుడు రఘు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండాకాలంలో వాడకం పెరగడంతో బిల్లులు మధ్యతరగతి ప్రజలను మరింత ఇబ్బంది పెట్టాయని అపార్ట్‌మెంట్ వాసులు చెప్పారు.
ఒక్క యూనిట్ ఎక్కువైతే..
కొన్నిసార్లు ఒక్క యూనిట్ ఎక్కవగా కరెంటు వాడినా బిల్లు మోత మోగుతోంది. సాధారణంగా 200 యూనిట్లకు ప్రస్తుత చార్జీల ప్రకారం రూ. 650 రావాలి. అదే ఇంకొక్క యూనిట్ పెరిగితే 201 యూనిట్లకు పెరిగిన చార్జీల ప్రకారం రూ. 1,067.20 అవుతోంది. ఒక్క యూనిట్ ఎక్కువ వాడినందుకు రూ.412 .20 ఎక్కువ కట్టాల్సి వస్తోంది.
బిల్లులు పెంచుకోడానికే!
ప్రతి వినియోగదారుడు రోజులో ఏ టైంలో ఎంత కరెంటు వాడాడో కచ్చితంగా తెలుసుకునే సాంకేతికత అందుబాటులో ఉంది. అయినా వాడకపోవడంతో బిల్లుల్లో కచ్చితత్వం ఉండటం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు రీడింగ్‌కు ఓ నెల ఆలస్యంగా వచ్చి మరో నెల ముందొచ్చినా ఇబ్బంది ఉండదన్న అధికారుల మాటల్లో నిజం లేదని మండిపడుతున్నారు. ఈమధ్య విద్యుత్ బిల్లు రీడర్లు సమ్మె చేయడంతో రీడింగ్ ఆలస్యమైందని, సీక్వెన్స్ తప్పి బిల్లులపై ప్రభావం పడిందని చెబుతున్నారు. కరెంటు చార్జీలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించలేదని, దీంతో చార్జీలు పెంచకుండానే నష్టాలు పూడ్చుకోవడానికి విద్యుత్ సంస్థలు ఇలా దొంగదెబ్బ తీస్తున్నాయని విమర్శిస్తున్నారు.
‘ప్రీపెయిడ్’పై పట్టించుకుంటేగా
ఒక్క యూనిట్ ఎక్కువై శ్లాబ్ మారితే చార్జీలు భారీగా పెరుగుతాయని చాలా మంది కస్టమర్లకు తెలియదు. తెలిసినా మీటరు రీడింగు చూసుకుంటూ విద్యుత్ వాడకాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ఒకవేళ జాగ్రత్తగా ఉన్నా రీడర్లు ఆలస్యంగా వస్తే యావరేజ్ పెరిగి మరో శ్లాబ్‌లోకి వెళ్లే చాన్స్ ఉంది. ఒక్కోసారి కరెంటు తక్కువ వాడినా కనెక్టెడ్ లోడ్ ఎక్కువని బిల్లులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. అంటే త్రీ ఫేజ్‌లో ఉన్న వ్యక్తి తక్కువ కరెంటు వాడినా మినిమం చార్జీలు పడుతున్నాయి. ప్రీపెయిడ్ విధానంతో ‘సరాసరి’ సమస్యకు పరిష్కారం ఉన్నా ఇప్పటివరకు అమలు చేయడం లేదు. ఆ మీటర్లను తీసుకురావాలని డిస్కంలను కేంద్రం ఆదేశించినా పట్టించుకోవడం లేదు.
టీఎస్ ఎస్‌పీడీసీఎల్‌కు రికార్డు వసూళ్లు
టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చార్జీల వసూళ్లను చూస్తే బిల్లులు పెరిగినట్టు తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలలను.. ఈ ఏడాది అవే నెలలతో పోలిస్తే బిల్లులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కో నెలలో రూ.50 నుంచి రూ. వంద కోట్ల వరకు తేడా ఉంది. ఈ ఏడాది జూన్‌లో రికార్డు స్థాయిలో రూ.1,044.07 కోట్లు బిల్లులు జారీ చేస్తే రూ.995.66 కోట్లు వసూలయ్యాయి. ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థ పరిధిలోనూ ఇలాగే బిల్లులు వచ్చినట్లు తెలుస్తోంది.