
- షాక్‌తో తల్లీకూతుళ్లు మృతి
- తలుపుపై పడడంతో కరెంట్ షాక్
- మృతులిద్దరూ బట్టీ కార్మికులు
- కరీంనగర్ జిల్లా చింతకుంట శివారులో ఘటన
కొత్తపల్లి, వెలుగు : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట శివారులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న తల్లీకూతుళ్లు కరెంట్ షాక్‌తో చనిపోయారు. ఎస్సై సాంబమూర్తి కథనం ప్రకారం..ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ జిల్లా పక్కన్గూడకు చెందిన విద్యాదర్ బిందానికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య బేని (36), కూతురు బాబి (18), కొడుకు దశరథ్‌తో కలిసి చింతకుంట శివారులోని లక్ష్మి బ్రిక్స్ కంపెనీలో పనిచేస్తోంది.
విద్యాదర్ చిన్న భార్య సృశితో కలిసి పక్కనే ఉన్న మరో ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి విద్యాదర్ పెద్ద భార్య బేని, కూతురు బాబి నిద్రపోగా, రాత్రి ఈదురుగాలులు వచ్చాయి. కరెంట్ వైర్లు తెగి ఇంటి తలుపుపై పడ్డాయి. గురువారం తెల్లవారుజామున తోటి కార్మికుడు జగన్నాథ్..బేనిని నిద్ర లేపడానికి వెళ్లి తలుపు కొట్టగా షాక్ కొట్టింది. దీంతో విద్యాదర్కు సమాచారం ఇవ్వగా అతడు వచ్చి కరెంట్ వైరును తప్పించి డోర్ తెరిచి చూడగా బేని, బాబి చనిపోయి ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై
తెలిపారు.
జమ్మికుంటలో రైతు..
జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో సర్వీస్ వైర్ సరిచేస్తుండగా షాక్ కొట్టి రైతు చనిపోయాడు. విలాసాగర్ కు చెందిన వేల్పుల శ్రీనివాస్(43) రైతు. బుధవారం అర్ధరాత్రి వర్షంతోపాటు గాలి దుమారం రాగా ఇంటివద్ద సర్వీస్ వైర్ తెగి కిందపడింది. తెల్లవారిన తర్వాత ఆ వైరును కర్రతో సరిచేస్తుండగా11కేవీ వైర్ తాకి షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండగా, ఇటీవల పెద్దకూతురికి పెండ్లి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.