
మంద బలం అనాలో.. మందు బలం అనాలో కానీ.. ఈ కొట్టుడు మాత్రం ఈ మధ్య ఎక్కడా చూడలేదు. చేతులు ఇరిగినా.. తలలు పగిలినా.. వదలకుండా పొట్టు పొట్టు కొట్టారు. కేవలం బిల్లు అడిగినందుకు పదుల సంఖ్యలో ఉన్న కస్టమర్లు పబ్ నిర్వాహకులు, బౌన్సర్లకు చితకబాదారు. రాడ్లు, గ్రిల్స్, కుర్చీలు, రాళ్లు.. ఇలా ఏది దొరికితే అది తీసుకుని విచక్షణా రహితంగా కొట్టడంతో.. దారుణంగా దెబ్బలుతిన్న పబ్ సిబ్బంది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హైదరాబాద్ లో శనివారం (సెప్టెంబర్ 20) అర్ధరాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శనివారం అర్ధరాత్రి కొండాపూర్ మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో పదుల సంఖ్యలో వచ్చిన కస్టమర్లు బౌన్సర్లను చితకబదారు. బిల్లు చెల్లించాలని కస్టమర్లను మేనేజర్ అడగడంతో గొడవ మొదలైనట్లు సిబ్బంది తెలిపారు.
మత్తులో ఉన్న కస్టమర్లు.. బిల్లు చెల్లింపు విషయంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటకు మాట పెరిగి.. తాగిన మత్తులో గట్టిగా అరుస్తూ మేనేజర్ ను బెదిరించారు. ఆ తర్వాత అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడికి దిగారు. కస్టమర్లను బయటికి పంపించే ప్రయత్నం చేసిన బౌన్సర్లతో గొడవకు దిగారు.
►ALSO READ | కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో నాపేరు తొలగించండి..హైకోర్టులో స్మితా సబర్వాల్ పిటిషన్
దీంతో ఆవేశంతో ఊగిపోయిన కస్టమర్లు.. బౌన్సర్లను ఘోరంగా కొట్టారు. పబ్ కిందా, పైనా, బయట.. అంతటా వెతికి మరీ దాడులు చేశారు. చేతిలో ఏదుంటే దాన్ని తీసుకుని చావబాదారు. ఈ గొడవలో ముగ్గురు బౌన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. తలలు పగిలి రక్తం కారుతున్న విజువల్స్ భయాందోళనకు గురిచేస్తున్నాయి. గాయాల పాలైన బౌన్సర్లను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.