
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నవంబర్ నెలలో రూ.2,250 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 26 లక్షల కేసుల బీర్లు, 27 లక్షల కేసుల ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) అమ్ముడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో అధికంగా రూ.526 కోట్ల విలువైన లిక్కర్ సేల్ అయ్యింది. తర్వాత హైదరాబాద్‌లో రూ.235 కోట్లు, నల్గొండలో రూ.234 కోట్లు, ఖమ్మంలో రూ.170 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. పోయినేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సేల్స్ తగ్గాయి. గతేడాది నవంబర్‌లో రూ.2,566 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. చలికాలం కావడంతో లిక్కర్‌కే వినియోగదారులు ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో కొద్దిరోజులుగా పెరిగిన బీర్ సేల్స్, మరోసారి తగ్గాయి. ఇక అక్టోబర్‌లో రూ.2,650 కోట్ల మద్యం సేల్ అయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.19,230 కోట్ల సేల్స్ జరిగాయి. ఇందులో 2.34 కోట్ల కేసుల ఐఎంఎల్, 2.11 కోట్ల కేసుల బీర్లు ఉన్నాయి. ఓవరాల్ సేల్స్‌లో రంగారెడ్డి జిల్లానే టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది ప్రతి నెలా సగటున రూ.2,500 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.