5 నెలల కిందే బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతులు.. సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఆర్డర్స్: హరీశ్‌రావు

5 నెలల కిందే బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతులు.. సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఆర్డర్స్: హరీశ్‌రావు
  • అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలుసా? తెల్వదా?
  • సీఎంల మీటింగ్‌కు పోనంటూనే రేవంత్​ పోయిండు
  • కమిటీ లేదంటూనే ఇప్పుడు కమిటీ వేసిండు
  • రేవంత్ ​ఉద్యమద్రోహి మాత్రమే కాదు.. జలద్రోహి కూడా..
  • సీడబ్ల్యూసీ అనుమతులను రద్దు చేయాల్సిందే
  • ఢిల్లీలో ధర్నా చేద్దాం అంటూ రేవంత్‌కు సూచన

హైదరాబాద్​, వెలుగు: ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం– బనకచర్ల / నల్లమలసాగర్​ ప్రాజెక్టులకు సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) అనుమతులు జారీ చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఈ ఏడాది జులై 31నే ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతులిచ్చి 5 నెలలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదని, మొద్దు నిద్ర నటిస్తున్నదని విమర్శించారు.

పోలవరం దిగువకు వరద భారీగా పోతున్నదని, 200 టీఎంసీలు తీసుకుపోయేందుకు అవకాశం ఉన్నదని క్లియర్‌‌‌‌గా పేర్కొంటూ సీడబ్ల్యూసీ అనుమతులిచ్చిందన్నారు. అసలు ఈ లెటర్​ వచ్చిన విషయం ప్రభుత్వానికి తెలుసా? లేదా? అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదా? అని నిలదీశారు. ఢిల్లీలో సీఎంల మీటింగ్​ అయ్యాక 15 రోజులకే పర్మిషన్​ వచ్చిందని, ఆ మీటింగ్‌‌లో రేవంత్‌‌రెడ్డి ఒప్పుకున్నారు కాబట్టే సీడబ్ల్యూసీ నుంచి అత్యంత కీలకమైన అనుమతి లభించిందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణభవన్‌‌లో హరీశ్‌‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకుండా ఈ అనుమతులివ్వడానికి కేంద్రానికి ఎంత ధైర్యమని మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సూత్రధారి చంద్రబాబైతే.. పాత్రధారి రేవంత్‌‌రెడ్డి అని ఆరోపించారు. కత్తి ఆంధ్రావాళ్లదే అయినా.. పొడిచేది మాత్రం రేవంత్‌‌రెడ్డేనని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు అనుమతులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, దానికి బీఆర్‌‌‌‌ఎస్​ మద్దతు ఇస్తుందని చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతులను రద్దు చేయాలంటూ ఢిల్లీలో ధర్నా చేద్దాం రా అని సీఎం రేవంత్‌‌ను డిమాండ్​ చేశారు.

సీఎంల మీటింగ్‌‌కు వద్దంటే పోయిండు..
ఏపీ బనకచర్ల పేరుతో ప్రాజెక్టు కట్టినా.. బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్‌‌‌‌కు మళ్లించినా తెలంగాణకే తీవ్ర నష్టమని, పోయేది తెలంగాణ జలాలేనని హరీశ్‌‌రావు చెప్పారు. రేవంత్​ సీఎంగా పనిచేస్తున్నారా? లేదంటే గురుదక్షిణ చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు. రేవంత్​ అప్పుడు ఉద్యమ ద్రోహి అని, ఇప్పుడు జలద్రోహిగా మారాడని విమర్శించారు. జూన్‌‌లో కేంద్రం నిర్వహించిన సీఎంల మీటింగ్‌‌కు పోనుపోను అనుకుంటూనే రేవంత్​ వెళ్లారని విమర్శించారు. మీటింగ్‌‌కు వెళ్లొద్దని ఎంత మొత్తుకున్నా వినలేదన్నారు. ఆ తర్వాత మరోసారి మాటమార్చి సమావేశంలో బనకచర్లపై మీటింగే జరగలేదంటూ బుకాయించారని తెలిపారు. 

మీటింగ్​ జరిగిన రోజే ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడే రేవంత్​ బండారాన్ని బయటపెట్టారని చెప్పారు. చర్చజరగలేదని, కమిటీ లేదని ఆనాడు సీఎం రేవంత్​ చెప్పారని, కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ నెల 15న ఏపీ కమిటీని నియమిస్తే.. 23న సీఎం రేవంత్​ కమిటీని వేశారని చెప్పారు. చంద్రబాబు సూచించిన వ్యక్తి ఆదిత్యనాథ్​ దాస్‌‌నే కమిటీకి చైర్మన్‌‌గా నియమించారన్నారు.

‘‘దోపిడీ దారుల ఏజెంటు, ఏపీకి నమ్మిన బంటు, ఇప్పుడు.. నీకు సలహాదారుడు తెలంగాణకు వెన్నుపోటుదారుడిగా ఘనత వహించిన ఆదిత్యనాథ్ దాస్. అడుగడుగునా తెలంగాణ ఆకాంక్షలకు, నీటి హక్కులకు అడ్డంపడ్డ సైంధవుడు ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా? తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా ఎట్లా చేయవచ్చో ఏపీ ప్రభుత్వానికి నేర్పించింది ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా? తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం పక్షాన అత్యంత శ్రద్ధగా వందకు పైగా లేఖలు రాశారు. 

రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ వేగంగా పూర్తి చేసేందుకు తోడ్పాటునందించారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు కూడా ఆయనే రూపకల్పన చేశారు. అసలు ఆ ప్రాజెక్ట్​పై కమిటీనే వేయొద్దంటే.. కమిటీ వేసి ఆ కమిటీకి దొంగ చేతికి తాళాలిచ్చినట్టు ఆదిత్యనాథ్​దాస్‌‌నే చైర్మన్​గా చేశారు. రేవంత్​.. ఏపీ కోవర్ట్​ అనడానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి?”అని హరీశ్‌‌రావు ప్రశ్నించారు.

టెండర్​ ఓకే అయ్యాక కోర్టులో కేసా ?
బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్‌‌‌‌ను ఏపీ వెనక్కు తీసుకుంటే.. ఏదో సాధించినట్టు సీఎం, నీళ్ల మంత్రి డబ్బా కొట్టుకున్నారని హరీశ్‌‌రావు విమర్శించారు. కానీ, లింక్‌‌లో ఎండ్‌‌ పాయింట్‌‌ను బనకచర్ల నుంచి నల్లమలసాగర్‌‌‌‌కు మార్చి నీటిని తరలించేలా ఏపీ కొత్త డీపీఆర్​ తయారు చేసేందుకు టెండర్లు పిలిచిందన్నారు.

గోదావరి నీళ్లను కృష్ణా ద్వారా తరలిస్తే.. గోదావరి ట్రిబ్యునల్​ అవార్డు ప్రకారం 45:21:14 తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుందని, అది గ్రహించే తెలంగాణకు నీటి వాటాలు దక్కకుండా చేయాలన్న కుట్రతోనే ఏపీ ప్రాజెక్టును మార్చిందని చెప్పారు. 

ప్రాజెక్టుకు డీపీఆర్​ టెండర్​ గడువు ఈ నెల 11తో ముగిసిపోయిందని, కానీ, ఆ తర్వాత 16న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిందని హరీశ్‌‌రావు గుర్తు చేశారు. ఆ కేసును నీరుగార్చేందుకు 23న కమిటీని కూడా నియమించిందని మండిపడ్డారు. ఒక పక్క కేసు వేశామని చెబుతూనే.. ఆ కేసు వీగిపోయేందుకు కమిటీనీ ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు.