- ఆ కేటాయింపులకు అప్రైజల్ పెట్టుకోండి.. పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం కొత్త కొర్రీ
- మైనర్ ఇరిగేషన్లో ఆదా అయిన నీటితో అప్రైజల్ ఇవ్వాలన్న సీడబ్ల్యూసీ
- గోదావరి డైవర్షన్‌తో వచ్చే 45 టీఎంసీలపై ట్రిబ్యునల్ వాదనల తర్వాత చూద్దామంటూ సూచనలు
హైదరాబాద్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరో కొర్రి పెట్టింది. మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన నీటి లెక్కలు సరిగ్గా లేవన్న సాకుతో ప్రాజెక్టును కొద్ది నెలల కింద సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అప్రైజల్ లిస్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ లెక్కలన్నీ స్పష్టంగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు వివరించారు.
పాలమూరు ప్రాజెక్టును అప్రైజల్ లిస్టులో చేర్చాలని ఇటీవల మళ్లీ కేంద్ర మంత్రులను, సీడబ్ల్యూసీని కోరారు. అయితే, తెలంగాణకు ఎప్పట్లాగానే మొండిచెయ్యి చూపిస్తున్న కేంద్రం.. ప్రాజెక్టు విషయంలోనూ అలాగే వ్యవహరించింది. ప్రాజెక్టు కేటాయింపులను సగానికి సగం తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ సూచించినట్టు తెలిసింది.
పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీల కేటాయింపులతో అప్రైజల్ చేయగా.. అందులో కేవలం 45 టీఎంసీలకు మళ్లీ అప్రైజల్ పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి 90 టీఎంసీల్లో.. 45 టీఎంసీలను పోలవరం ద్వారా ఏపీ డెల్టా సిస్టమ్‌కు మళ్లించిన గోదావరి డైవర్షన్ నీళ్ల రీప్లేస్మెంట్, మరో 45 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేసిన నీళ్లను కలిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు అప్రైజల్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. కానీ, ఏండ్లకేండ్లు సాగదీస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదు.
ట్రిబ్యునల్‌లో తేలిన తర్వాతేనట..
సగం కేటాయింపులతో అప్రైజల్ చేసుకోవాలని చెప్తున్న కేంద్రం.. మిగతా సగం కేటాయింపులను ట్రిబ్యునల్‌లో వాదనలు అయ్యాక ప్రాజెక్టుకు చేసుకోవాలని సీడబ్ల్యూసీ సూచించినట్టుగా తెలిసింది. కృష్ణా జలాల విషయంలో ప్రస్తుతం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వాదనలు పూర్తయ్యి.. ప్రస్తుతం ఏపీ తన వాదనలను వినిపిస్తున్నది.
ట్రిబ్యునల్ ముందు గోదావరి డైవర్షన్‌తో మనకు వచ్చే వాటా 45 టీఎంసీలపైనా వాదనలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ నీళ్ల అంశాన్ని ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పినట్టు తెలిసింది. తీర్పు వచ్చే వరకు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి కాబట్టి.. తొలిదశలో కనీసం తాగునీటి కోసమైనా 45 టీఎంసీలకు అప్రైజల్ పెట్టుకోవాలని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇరిగేషన్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నది.
ఎలాగూ ట్రిబ్యునల్ కేటాయింపులు లేట్ అయ్యే అవకాశం ఉందన్న విషయం నిజమే కాబట్టి.. తొలుత తాగునీటి కాంపొనెంట్ కోసం అప్రైజల్ పెట్టుకుంటే బాగుంటుందా అన్న అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే యోచనలో అధికారులున్నట్టు తెలిసింది.

