ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య గురువారం (డిసెంబర్ 11) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. పూర్తిగా బ్యాటింగ్ ట్రాక్ కావడంతో ఈ మ్యాచ్ లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. తొలి టీ20లో గెలిచి భారత జట్టు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంటే.. సౌతాఫ్రికా భారీ ఓటమి నుంచి త్వరగా బయటకు వచ్చి టీమిండియా ఓడించాలనే ఆలోచనలో ఉంది. సూర్య సేన హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతోంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్స్ లో లైవ్ టెలికాస్టింగ్.. జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
తొలి టీ20లో గెలిచిన టీమిండియా టీమిండియా రెండో టీ20లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. గెలిచిన జట్టులో ఎలాంటి మార్పులు చేయాలనుకోవడం లేదు. ప్లేయింగ్ 11లో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఒక మార్పు చేయాలని కోరుకుంటున్నారు. ఓపెనర్ శుభమాన్ గిల్ స్థానంలో సంజు శాంసన్ కు అవకాశమివ్వాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. గిల్ ప్రస్తుతం టీమిండియా టీ20 వైస్ కెప్టెన్. రెండో టీ20లో ఆడడం పక్కా. కానీ నెటిజన్స్ మాత్రం శుభమాన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. శాంసన్ ఓపెనర్ గా అర్హుడని.. ఫామ్ లో లేని గిల్ ని జట్టులో కొనసాగించడం అనవసరం అని భావిస్తున్నారు.
Also read:- ఐపీఎల్‌లో ఆల్ టైమ్ రికార్డ్.. టీమిండియాలో అట్టర్ ఫ్లాప్
నిరాశపరుస్తున్న గిల్:
టీ20 వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్ ఫామ్ ఇండియాను కలవరపెడుతోంది. ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. కాన్‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. ఆ తర్వాత నాలుగో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్దగా రాణించడం లేదు. గిల్ చివరి 13 ఇన్నింగ్స్ లు చూసుకుంటే 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2) ఇలా ఉన్నాయి. కేవలం 3 సార్లు మాత్రమే 30 పరుగుల మార్క్ అందుకున్నాడు. దీంతో గిల్ స్థానంలో శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

