
బషీర్బాగ్, వెలుగు: స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి సైబర్ చీటర్స్ రూ.15 లక్షలు కాజేశారు. సిటీకి చెందిన 46 ఏండ్ల ప్రభుత్వ ఉద్యోగికి గత నెల 9న ట్రేడింగ్ పై సూచనలు ఇస్తామని స్కామర్స్ నుంచి వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చింది. తమ సూచనల ద్వారా ఇతరులు లాభాలు పొందినట్లు స్క్రీన్ షాట్స్ ను తరుచూ పంపించారు. తమ కంపెనీ సెబీ రిజిస్టర్ అని, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలని, లాభాలు వచ్చేలా తాము సూచనలు ఇస్తామని ఒత్తిడి చేశారు.
వారి మాటలను నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.15.20 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే, తాము క్రియేట్ చేసిన ఫేక్ ట్రేడింగ్ యాప్ లో రూ.91 లక్షల లాభాలను స్కామర్స్ చూపించారు. ఈ డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే అదనంగా మరో రూ.4.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు.