అడవిలో దూప దూప!..ట్రాఫిక్‌  జామ్‌తో తాగునీటి కోసం భక్తుల తిప్పలు

అడవిలో దూప దూప!..ట్రాఫిక్‌  జామ్‌తో తాగునీటి కోసం భక్తుల తిప్పలు

జయశంకర్‌ భూపాలపల్లి, వెలుగు: సరస్వతి పుష్కరాల కోసం కాళేశ్వరం వస్తున్న భక్తులు మంచినీటి కోసం తిప్పలు పడుతున్నారు. మహదేవ్‌పూర్‌‒కాళేశ్వరం మధ్య ట్రాఫిక్‌ జామ్‌తో గంటల తరబడి భక్తులంతా అడవి మార్గంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. 18 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు నుంచి నాలుగు గంటల పాటు ఆగాల్సి రావడంతో, ఆ సమయంలో తాగడానికి నీళ్లు దొరకక అరిగోస పడుతున్నారు.

ఎండ వేడిమికి తాళలేక మహిళలు, పిల్లలు సొమ్మసిల్లి పడిపోగా, అడవిలోని చెట్ల కింద సేదదీరారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, ప్రైవేట్‌  వెహికల్స్‌లో ప్రయాణిస్తున్న వారు అడవిలోని చెట్ల కిందకు పరుగులు పెట్టారు. గోదావరి నుంచి చెల్పూర్‌ జెన్‌కో వరకు రోడ్డు వెంబడి వేసిన పైప్‌లైన్‌ గేట్‌వాల్వ్‌ దగ్గర లీకవుతున్న నీళ్లు పట్టుకొని దూప తీర్చుకుంటున్నారు. కాళేశ్వరం‒మహాదేవ్‌పూర్‌ రూట్‌లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.