- అమెరికా కంపెనీ స్పార్టన్‌తో అగ్రిమెంట్
- ఇండియాలోనే తయారీ
- నేవీని బలోపేతం చేస్తామన్న అదానీ గ్రూప్
- దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని వెల్లడి
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్, అమెరికాకు చెందిన డిఫెన్స్ కంపెనీ స్పార్టన్‌తో డీల్ కుదుర్చుకుంది. సముద్ర లోతుల్లో సబ్‌మెరైన్‌లను గుర్తించడానికి ఎలక్ట్రానిక్ సెన్సర్స్, నావిగేషన్ సిస్టమ్స్‌ను ఈ కంపెనీలు డెవలప్, తయారు చేస్తాయి. ఇందుకు సంబంధించి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పార్టన్ (డిలియాన్ స్ప్రింగ్స్ ఎల్‌ఎల్‌సీ)తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇండియన్ నేవీ కోసం యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ఏఎస్‌డబ్ల్యూ) పరికరాలను తయారు చేయనుంది.
‘ఆత్మనిర్భర్ భారత్’ ఇనీషియేటివ్ కింద సోనోబూయ్‌లు, ఇతర ఏఎస్‌డబ్ల్యూ సిస్టమ్స్‌ను ఇండియాలో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తయారు చేస్తుంది. సోనోబూయ్ అంటే సముద్రం లోతుల్లో సౌండ్స్‌ను గుర్తించే పరికరాలు. ఇండియాలో సోనోబూయ్ సొల్యూషన్స్ తయారు చేసే మొదటి ప్రైవేట్ కంపెనీగా అదానీ డిఫెన్స్ నిలుస్తుంది. ఫ్లోరిడాలోని డి లియాన్ స్ప్రింగ్స్‌లో హెడ్‌క్వార్టర్స్ ఉన్న స్పార్టన్, యూఎస్ నేవీ, అలైడ్ మిలిటరీ ఫోర్సెస్ కోసం అండర్‌సీ వార్‌ఫేర్ (సముద్రంలో యుద్ధానికి) సపోర్ట్ చేసే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ను డెవలప్ చేస్తోంది. సప్లై చేస్తుంది. ఈ కంపెనీని 2020 డిసెంబర్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్బిట్ సిస్టమ్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.
ఈ డీల్‌కు ముందు, అదానీ గ్రూప్ 2018లో ఎల్బిట్ సిస్టమ్స్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి, హెర్మెస్ 900 డ్రోన్స్‌ను తయారు చేసింది. ‘మినీ’ డ్రోన్ మిస్సైల్ తయారీని 2020లో అదానీ- ఎల్బిట్ ప్రకటించింది. అలాగే, ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్‌తో కలిసి అసాల్ట్ వెపన్స్, స్నైపర్ రైఫిల్స్, మెషిన్ గన్స్‌ను కూడా అదానీ డిఫెన్స్ తయారు చేస్తోంది. తాజా పార్ట్‌నర్‌షిప్ కింద సోనోబూయ్‌లు, అండర్‌సీ డొమైన్ అవేర్‌నెస్ (యూడీఏ)ని మెరుగుపరిచే కీలకమైన ప్లాట్‌ఫామ్స్‌ను, సబ్‌మెరైన్స్, ఇతర అండర్‌వాటర్ ప్రమాదాలను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి అవసరమయ్యే పరికరాలను అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండియాలో తయారు చేస్తుంది.
ఆత్మనిర్భర్ భారత్‌తో ముందుకు
“నేవీకి అవసరమయ్యే ఏఎస్‌డబ్ల్యూ పార్టుల కోసం దశాబ్దాలుగా ఇండియా దిగుమతులపై ఆధారపడుతోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ ఇనీషియేటివ్‌తో పాటు, స్పార్టన్ సాయంతో వీటిని ఇండియా కోసం, ఇండియాలోనే అదానీ గ్రూప్ తయారు చేస్తుంది” అని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఒక స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ జీత్ అదానీ మాట్లాడుతూ, “సముద్ర జలాల్లో అనిశ్చితులు పెరుగుతున్నాయి. దేశ రక్షణకు నేవీని బలపరచడం చాలా కీలకం. సోనోబూయ్‌ల లాంటి క్రిటికల్ సిస్టమ్స్ స్వతహాగా డెవలప్ చేయాలి. వేగంగా మోహరించగలగాలి. వీటి సామర్ధ్యం గ్లోబల్ స్టాండర్డ్‌లో ఉండాలి. స్పార్టన్‌తో కుదిరిన ఈ పార్ట్‌నర్‌షిప్ ద్వారా, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఇండియాలో సోనోబూయ్ సొల్యూషన్స్‌ను స్వతహాగా డెవలప్ చేస్తుంది” అని అన్నారు.
అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈఓ అశిష్ రాజవంశీ మాట్లాడుతూ, “వరల్డ్-క్లాస్ సోనోబూయ్ టెక్నాలజీని తీసుకొచ్చి, ఇండియా డిఫెన్స్ సామర్ధ్యాన్ని బలపరచడానికే ఈ పార్టనర్‌షిప్ కుదుర్చుకున్నాం. ఈ కీలకమైన టెక్నాలజీని సొంతంగా డెవలప్ చేసుకోవడం చాలా కీలకం” అని పేర్కొన్నారు. స్పార్టన్ డిలియాన్ స్ప్రింగ్స్ ఎల్‌ఎల్‌సీ ప్రెసిడెంట్ డొనెల్లీ బోహన్ మాట్లాడుతూ, “ అమెరికా మారిటైమ్ డిఫెన్స్‌కు గొప్ప సొల్యూషన్లను స్పార్టన్ అందిస్తోంది. అదానీ డిఫెన్స్‌తో కలిసి తమ ఫ్యూచర్ ఏఎస్‌డబ్ల్యూ టెక్నాలజీని ఇండియాకు తీసుకురావడాన్ని గర్వంగా భావిస్తున్నాం. ఇండియాలోనే అసెంబ్లింగ్ చేపడతాం” అని వివరించారు.
