
- ఏజెన్సీల గడువు ముగిసి 7 నెలలు
- అప్పటి నుంచి లైట్ తీస్కుంటున్న జీహెచ్ఎంసీ
- అధ్వానంగా రోడ్ల పరిస్థితి
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లోని ప్రధాన రోడ్లను కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) కింద మళ్లీ ఏజెన్సీలకు అప్పగిస్తారా లేక బల్దియానే మెయింటెయిన్చేస్తుందా అన్న దానిపై స్పష్టత రావడం లేదు. గతంలో ఏజెన్సీలకు అప్పగించిన నిర్వహణ బాధ్యతల కాలపరిమితి పూర్తయి ఇప్పటికే ఏడు నెలలవుతోంది. మళ్లీ ఏజెన్సీలకే అప్పగించాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రపోజల్స్ పంపింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో జీహెచ్ఎంసీనే నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంది. అయితే, ఏడు నెలలుగా బల్దియా పెద్దగా పట్టించుకోవడం లేదు. స్వీపింగ్ మెషీన్లు ఏదో నామ్ కే వాస్తేగా అన్నట్లు పనిచేస్తున్నాయి. దీంతో రోడ్లు క్లీన్ కాకపోవడంతో దుమ్ము, ధూళి లేస్తోంది.
అలాగే రోడ్లు డ్యామేజ్అయిన ప్రాంతాల్లోనూ రోడ్ల రిపేర్లు చేయడం లేదు. గ్రేటర్లోని 812 కిలోమీటర్ల రోడ్లను రూ.1839 కోట్లకు ఐదేండ్ల పాటు నిర్వహణకు 2020లో ఏజెన్సీలకు అప్పగించారు. వారి గడువు ముగిసిన తర్వాత రోడ్ల నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సింది బల్దియానే..జీహెచ్ఎంసీలోనూ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా ఇంజినీర్లు కూడా ఉన్నారు. వీరికి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో పాటు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తే సిటీలోని ప్రధాన రోడ్ల నిర్వహణ సక్రమంగానే ఉంటుంది. కానీ, బల్దియా మాత్రం ఏజెన్సీలకే అప్పగించాలని సర్కారుకు లెటర్ రాసింది. ఏజెన్సీలకు ఐదేండ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే దాదాపు రూ.2వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఏజెన్సీలకే అప్పగిస్తారని..
ఇదివరకు ఏజెన్సీలకు అప్పగించిన రోడ్లను మళ్లీ ఏజెన్సీలకే అప్పగిస్తారని, అందుకే జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. రోడ్లు డ్యామేజ్అయినా వెంటనే పనులు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇతర పనుల కోసం రోడ్లను తవ్వి తిరిగి రోడ్లను వేయడంలేదు. ఫుట్ పాత్ లను తవ్వేసి అలాగే వదిలేశారు. ఇలా సీఆర్ఎంపీ రోడ్లపై అడుగడుగునా నిర్వహణ లోపం కనిపిస్తోంది. ఏజెన్సీలకు అప్పగిస్తే ఇదంతా వారే చూసుకుంటారని అధికారులు లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోపైనా నిర్వహణ బాధ్యతలను సరిగ్గా చేపట్టాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
బల్దియాకే ఇవ్వాలనుకుంటున్న సర్కారు
ఇన్నాళ్లు ఏజెన్సీలకు అప్పగించగా, ఇక నుంచి బల్దియా అధికారులకే నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో ఐదు ఏజెన్సీలకు మెయింటనెన్స్బాధ్యతలు అప్పగించగా, చాలా ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణ సరిగ్గా చేయలేదు. పనులు చేయకుండానే రూ. కోట్లు ఖర్చు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంది. దీంతో ప్రభుత్వం సెకండ్ ఫేజ్ కి సంబంధించిన అనుమతుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందకే జీహెచ్ఎంసీ పంపిన ప్రపోజల్స్ పై స్పందించనట్టు సమాచారం.