
- రెంటల్ బేసిస్ మీద షోలు వేయలేం
- పర్సంటేజీ రూపంలో చెల్లింపులు చేయాల్సిందే
- తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. నిర్మాతలకు లేఖ రాయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు జూన్ 1 నుంచి మూతపడనున్నాయి. రెంటల్ బేసిస్‌లో షోలు వేయలేమని ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లింపులు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. రోజువారీ అద్దె కాకుండా గ్రాస్ కలెక్షన్స్‌లో వాటా ఇవ్వాలని కోరుతున్నారు.
తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే థియేటర్లు తెరుస్తామని.. లేదంటే, జూన్ 1 నుంచి మూసేస్తామని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు డిసైడ్ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు హాజరయ్యారు.
ఖర్చులు పెరిగిపోయినయ్
థియేటర్లు నడపడం అంత ఈజీ కాదని, ఖర్చులు భారీగా పెరిగిపోయాయని ఎగ్జిబిటర్లు అన్నారు. ‘‘అద్దె రూపంలో ఇచ్చేది సరిపోవడం లేదు. నష్టాలు ఎక్కువ వస్తున్నాయి. పర్సంటేజ్ విధానంలో మార్పులు తీసుకోవాలి. లేదంటే థియేటర్లు బంద్ చేయడం పక్కా’’అని థియేటర్ ఓనర్లు తేల్చి చెప్పారు. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో వచ్చే నెల రిలీజ్ అయ్యే సినిమాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. జూన్‌లో పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న విడుదల కానున్నది. అలాగే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటించిన ‘కుబేర’ జూన్ 20న రిలీజ్ కానున్నది. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న ‘కన్నప్ప’ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావాల్సిన టైమ్‌లోనే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ చేస్తామంటూ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఎగ్జిబిటర్లు ప్రతిపాదించిన మూడు పర్సంటేజీల విధానం
రూ.30 కోట్ల కంటే ఎక్కువగా నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఫస్ట్ వీక్ 75 శాతం డిస్ట్రిబ్యూటర్, 25 శాతం ఎగ్జిబిటర్.. సెకండ్ వీక్ లో 55 శాతం డిస్ట్రిబ్యూటర్, 45 శాతం ఎగ్జిబిటర్., థర్డ్ వీక్‌లో 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్. నాల్గో వారంలో 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్ పర్సంటేజ్‌గా ఉండేది.
రూ.10 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఫస్ట్ వీక్ 60 శాతం డిస్ట్రిబ్యూటర్, 40 శాతం ఎగ్జిబిటర్, సెకండ్ వీక్ లో 50 శాతం డిస్ట్రిబ్యూటర్, 50 శాతం ఎగ్జిబిటర్, థర్డ్ వీక్ 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్.. నాలుగో వారంలో 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్ పర్సంటేజ్‌గా ఉండేది.
రూ.10 కోట్లలోపు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఫస్ట్ వీక్‌లో 50 శాతం డిస్ట్రిబ్యూటర్, 50 శాతం ఎగ్జిబిటర్.. సెకండ్ వీక్ లో 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్, థర్డ్ వీక్‌లో 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్‌కు ఉండేది.