
ములుగు, వెలుగు: ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని మంత్రి దనసరి అనసూయ(సీతక్క) పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలిసారిగా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డేటా ప్రో సంస్థ(ఎన్జీవో) ట్రైనింగ్ పార్టనర్ గా ములుగు మండలం జగ్గన్నపేటలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. రూ.15వేల చొప్పున 175 మందికి రూ.26.25 లక్షలు కేటాయించి 30 రోజుల శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి పథకాన్ని ఆడబిడ్డ పేరిట ఇస్తూ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. లైబ్రరీ చైర్మన్ బానోత్ రవిచందర్, డీడబ్ల్యూవో శిరీష, మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ రమాదేవి పాల్గొన్నారు.