బల్క్ గా వస్తువులని.. రూ.39 లక్షల ఫ్రాడ్ ..టెలిగ్రామ్ ద్వారా వ్యాపారిని మోసం చేసిన సైబర్ చీటర్స్

బల్క్ గా వస్తువులని..  రూ.39 లక్షల ఫ్రాడ్ ..టెలిగ్రామ్ ద్వారా వ్యాపారిని మోసం చేసిన సైబర్ చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు : తక్కువ ధరకే బల్క్​గా వస్తువులను అమ్ముతామని నమ్మించి, సిటీకి చెందిన యువ వ్యాపారిని సైబర్ చీటర్స్ మోసగించారు. మెహదీపట్నంకు చెందిన 28 ఏండ్ల వ్యాపారి.. తరుచూ సోషల్ మీడియా ద్వారా ఆన్​లైన్​లో వస్తువులను కొంటుంటాడు. 

మే13న ఓ టెలిగ్రామ్ గ్రూపులో తక్కువ ధరకే బల్క్​గా​వస్తువులు అమ్ముతామని స్కామర్స్ పెట్టిన మెసేజ్ చూశాడు. వాటిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకొని.. అడ్వాన్స్​గా రూ.9.99 లక్షలు చెల్లించాడు. 

అనంతరం స్కామర్స్ డెలివరీ ఇష్యూ ఉందంటూ మరో మూడు లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత మొత్తం డబ్బులు చెల్లిస్తేనే వస్తువులను డెలివరీ చేస్తామన్నారు. దీంతో బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ.39.74 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ ఎలాంటి వస్తువులు పంపించలేదు. అతని నంబర్ ను కూడా బ్లాక్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు.. సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రీల్ చూసి పెట్టుబడి.. రూ.9.65 లక్షలు గాయబ్

లక్డీకాపూల్​కు చెందిన 46 ఏండ్ల వ్యక్తి ఇన్​స్టాలో రీల్​చూసి, నోముర యాప్​లో షేర్ ట్రేడింగ్ చేశాడు. నేహా అయ్యర్ అనే మహిళ గైడెన్స్‌‌‌‌‌‌‌‌తో వాట్సాప్ గ్రూప్​లో చేరి, రూ.9.65 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత యాప్​లో స్కామర్లు రూ.27.51 లక్షల లాభాలు చూపించారు. వాటిని విత్​డ్రా చేయకుండా బ్లాక్ చేసి, అదనంగా రూ.18 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మోసం గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.