ములుగు, వెలుగు : సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా లక్ష్యంగా పంపించే లింక్ లపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింక్ లను ఓపెన్ చేయొద్దని ఓఎస్డీ శివం ఉపాధ్యాయ సూచించారు. మంగళవారం ములుగు సైబర్ కార్యాలయంలో సైబర్ క్రైం డీఎస్పీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ, సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫ్రాడ్ కా ఫుల్స్టాప్ లో భాగంగా ఆరు వారాల సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఓఎస్డీ శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ ఎవరైనా డిజిటల్ అరెస్ట్ పేరిట ఫోన్ చేస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలన్నారు. సైబర్ నేరగాళ్ల వల్ల మోసపోతే వెంటనే www.cybercrime.gov.in వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేయాలని, క్రైమ్ పోలీసులకు, సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు సీఐ దారం సురేశ్, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ సబ్ రిజిస్ట్రార్ రఘురాం, మెడికల్ కాలేజీ అధ్యాపకుడు జీవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
