ఢిల్లీ, నార్త్​ ఇండియా కేంద్రంగా సైబర్​ నేరాలు

ఢిల్లీ, నార్త్​ ఇండియా కేంద్రంగా సైబర్​ నేరాలు

హైదరాబాద్, వెలుగు: ప్రజలను మోసం చేసి రూ. వేల కోట్లు కొల్లగొడుతున్న విదేశీ సైబర్​నేరగాళ్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతున్నారు. టూరిస్ట్, బిజినెస్​ వీసాలతో వస్తున్న విదేశీయులు ఢిల్లీ, నార్త్​ ఇండియా కేంద్రంగా సైబర్​ నేరాలకు పాల్పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతోంది. ఎలాగోలా పట్టుకున్నప్పటికీ కొంతకాలానికే బెయిల్​పై బయటకు వచ్చి ఎస్కేప్​అవుతున్నారు. మళ్లీ మోసాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఏటేటా సైబర్​నేరాల సంఖ్య పెరుగుతూ పోతోంది. రాష్ట్రంలో 2020లో 5,024 సైబర్​నేరాల కేసులు నమోదు కాగా 2021లో 10,303 కేసులు నమోదయ్యాయి. ఇందులో 7,003 కేసులు క్రెడిట్​కార్డులు, ఏటీఎం, ఆన్​లైన్​బ్యాకింగ్, ఓటీపీకి సంబంధించిన మోసాలు కావడం గమనార్హం. ఇందులో అత్యధికంగా హైదరాబాద్​లోనే 2,800 కేసులు నమోదయ్యాయి.

సైబర్​ నేరాల కేసుల్లో నాన్‌‌ బెయిలబుల్ వారెంట్స్‌‌ ఇష్యూ అయినా పట్టుకోవడంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. గతేడాది నమోదైన కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 265 మందిని, విదేశాలకు చెందిన 13 మందిని సైబర్‌‌‌‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చార్జిషీట్స్ కూడా ఫైల్ చేశారు. ఈ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితులపై సైబర్‌‌ ‌‌క్రైమ్ పోలీసులు ఇంటర్‌‌‌‌పోల్‌‌ను ఆశ్రయిస్తున్నారు. నైజీరియన్స్, చైనా సహా  విదేశీ క్రిమినల్స్​పై లుక్ ఔట్‌‌ నోటీసులు(ఎల్‌‌వోసీ) ఇష్యూ చేస్తున్నారు.

కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ట్రాప్

ఇతర దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఢిల్లీలో షెల్టర్ తీసుకుంటున్నారు. దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో నార్త్‌‌ ఇండియాలోని రాష్ట్రాలకు చెందిన వారితో సైబర్ నెట్‌‌వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారు. చైన్‌‌ సిస్టమ్‌‌తో ఏజెంట్లను నియమిస్తున్నారు. బ్యాంక్ అకౌం ట్స్, ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్‌‌ చేసే విధంగా మొబైల్ యాప్స్, పేమెంట్ గేట్‌‌వేస్‌‌ క్రియేట్‌‌ చేస్తున్నారు.  కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు ప్లాన్ చేస్తున్నారు. విదేశాల నుంచి ఆపరేట్‌‌ చేసే విధంగా లింక్స్‌‌ సర్క్యులేట్‌‌ చేస్తున్నారు. పేమెంట్ గేట్‌‌వే ద్వారా అమౌంట్‌‌ కలెక్షన్‌‌,షెల్‌‌ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నారు. ఇలా ప్రతి ఏడాది నమోదవుతున్న సైబర్ నేరాల్లో 90 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి, మరో10 శాతం మంది విదేశాల నుంచి సైబర్ నేరాలను ఆపరేట్‌‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కదిలిన చైనా డొంక

2020 ఆగస్టులో కలర్‌‌‌‌ ప్రిడిక్షన్‌‌ పేరుతో ఆన్‌‌లైన్‌‌ గేమింగ్ స్కామ్‌‌ బయట పడింది. చైనాకు చెందిన యాన్ హూ ల్యాంబో ఢిల్లీకి చెందిన ముగ్గురు స్థానికులతో కలిసి ఆన్‌‌లైన్ గేమ్ యాప్స్‌‌ నిర్వహించాడు. స్థానికులనే డైరెక్టర్లుగా చేసి 38 షెల్‌‌ కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి ద్వారా రూ.1800 కోట్లు కొల్లగొట్టాడు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేశారు. కలర్‌‌‌‌ ప్రిడిక్షన్‌‌ గేమ్‌‌తో పాటు మొబైల్‌‌ యాప్స్ కూడా ఇండియాలో ఏర్పాటు చేసిన కంపెనీల నుంచి సేల్‌‌ చేసినట్లు గుర్తించారు.  బీజింగ్‌‌ టుమారో కంపెనీతో కనెక్ట్ అయి ఉన్న బ్యాంక్‌‌ అకౌంట్ల ఆధారంగా చైనా నిందితుడు యాన్‌‌ హూ అలియాస్ ల్యాంబో, ఢిల్లీకి చెందిన ధీరజ్‌‌ సర్కార్‌‌, అంకిత్‌‌ కపూర్‌‌, నీరజ్‌‌ తులిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే లోన్‌‌ యాప్స్‌‌ కేసుల్లో కూడా స్థానిక సైబర్‌‌‌‌ నేరగాళ్లను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 9,921 బ్యాంక్ అకౌంట్లు, 22,319కి పైగా ఫోన్‌‌ నంబర్ల డేటా కలెక్ట్ చేశారు.