అవగాహన కల్పిస్తున్నా ఆగని సైబర్ మోసాలు

అవగాహన కల్పిస్తున్నా  ఆగని సైబర్ మోసాలు
  • పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్న ప్రజలు

మెదక్, వెలుగు: పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తున్నప్పటికీ జిల్లాలో సైబర్ మోసాలు ఆగడం లేదు. చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టు కుంటున్నారు. ఇటీవల తూప్రాన్, శివ్వంపేట, పెద్దశంకరంపేట, కౌడిపల్లి మండలాల్లో పలువురు సైబర్ మోసాలకు గురయ్యారు. 

సాధారణ ప్రజలు, యువకులు, విద్యావంతులతో  పాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. ముందు వెనక ఆలోచించకుండా వాట్స్ అప్ లో వచ్చే లింక్ లు ఓపెన్ చేసి కొందరు.. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే వారు అడిగినట్టు ఓటీపీలు, ఆధార్ కార్డ్ నంబర్లు చెప్పి మరి కొందరు మోసపోతున్నారు. 

జిల్లాలో సైబర్ క్రైమ్ మోసాలిలా..

కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన శివరాజ్ విద్యుత్ లైన్​మన్ గా  కౌడిపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆగస్ట్​22న అతడి సెల్ ఫోన్ కు వాట్సప్ లో ఏపీకే లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగా రూ.10 వేల రివార్డు వస్తుందని మెసేజ్ వచ్చింది. శివరాజ్  వాట్సాప్ లో వచ్చిన  లింకును నొక్కాడు. అంతలోనే మరొక మెసేజ్ వచ్చింది.  ఏటీఎం నంబరు, పాస్వర్డ్ పంపించాలని మెసేజ్ రాగా వెంటనే అనుమానం వచ్చిన శివరాజ్ వాట్సాప్​క్లోజ్ చేశాడు. ఇంతలోనే అతడి బ్యాంక్ అకౌంట్లో నుంచి రూ.49,870 కట్టయినట్లు మెసేజ్ వచ్చింది.  

ఆగస్ట్​20న తూప్రాన్ కు చెందిన ఓ వ్యక్తి  ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ప్రకటన చూసి మెసేజ్ పెట్టాడు.  వెంటనే అతడిని  వాట్సాప్ గ్రూప్‌లో  చేర్చారు. తర్వాత  మోసగాళ్లు ఒక లింక్ పంపి ఇన్వెస్ట్​చేయాలని ప్రలోభ పెట్టారు. మొదట్లో అతడికి నమ్మకం కలిగేలా రూ.15 వేలు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించారు. ఈ నకిలీ ప్లాట్ ఫామ్ నిజమైనదని నమ్మి అతడు దాదాపు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత అతడు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా ఆ డబ్బులు రాలేదు. ఆ డబ్బులు కావాలంటే మోసగాళ్లు అదనంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాలని డిమాండ్ చేశారు. మోసపోయానని గ్రహించి వెంటనే1930కి కాల్ చేసి  ఫిర్యాదు చేశాడు. 

పెద్ద శంకరంపేటకు చెందిన వ్యక్తికి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మోసగాడు మాట్లాడుతూ తాను ముద్ర లోన్ ఎక్సక్యూటివ్ ను అని పరిచయం చేసుకొన్నాడు. మీకు  రూ.2 లక్షల లోన్ మంజూరు అయిందన్నాడు. ఆ డబ్బు అందాలంటే  డాక్యుమెంట్ చార్జెస్ రూ.5 వేలు కట్టాలని చెప్పాడు. బాధితుడు రూ.5 వేలు కట్టిన తర్వాత అతన్ని  నమ్మించే విధంగా అతడి పేరు మీద బాండ్ పేపర్  పంపించారు. ఆ తర్వాత ఈ కేవైసీ  అప్​డేట్​లేదని దానికి రూ.20 వేలు అవుతాయని చెప్పి పలుమార్లు డబ్బులు కాజేశారు. దీంతో   బాధితుడు మోసపోయానని గమనించి పీఎస్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

శివ్వంపేటకు చెందిన ఓ వ్యక్తికి స్నేహితుడి వాట్సాప్ నుంచి నేను హాస్పటల్ లో ఉన్న  నాకు ఎమర్జెన్సీ గా కొంచెం డబ్బులు కావాలి అని  మెసేజ్ వచ్చింది. హాస్పటల్ అని చెప్పే సరికి అది నిజమని నమ్మి  రూ.40 వేలు అతడు సూచించిన నెంబర్ కు పంపించాడు. ఆ తర్వాత ఫోన్ చేసి అడిగే సరికి నేను డబ్బులు అడగలేదని నా మొబైల్ వాట్సాప్ లో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల హ్యాక్ అయిందని  చెప్పాడు. దీంతో తను మోసపోయానని గమనించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

సైబర్  మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్ ద్వారా ఎవరైనా మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. ఎవరైనా డబ్బులు  పంపించమని మెసేజ్ ద్వారా అడిగినట్లయితే ఫోన్ చేసి అడిగి తెలుసుకొని మాత్రమే పంపించాలి. ఎవరైనా అనుమానాస్పద కాల్స్ చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి. ప్రజల భద్రత కోసం సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.  - డీవీ శ్రీనివాస రావు, ఎస్పీ మెదక్