- పైసలివ్వకపోయినా, స్పందించకున్నా పేర్లు బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్
- అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆన్ లైన్ జ్యోతిష్యం చెప్తామని, తంత్ర శక్తి ఉందని, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం చూపుతామని, శాంతిపూజలు జరుపుతామని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తామని, ప్రేమ వివాహం జరిగేలా చూస్తామని, వశీకరణ విద్య, బిజినెస్ గ్రోత్, కుటుంబ కలహాల పరిష్కారం అంటూ ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరతీశారని పోలీసులు పేర్కొన్నారు.
సైబరాబాద్సైబర్ క్రైం కమిషనర్ టి. సాయి మనోహర్ ఆ వివరాలు తెలియజేశారు. ఇటీవల సోషల్ మీడియాలో సైబర్ కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ చేసుకుని తక్కువ డబ్బులు తీసుకుని సేవ చేస్తామని నమ్మిస్తారని, తర్వాత ఆ పూజ చేయాలి..ఈ పూజా చేయాలంటూ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తారన్నారు. బాధితులు డబ్బులు చెల్లించడం నిలిపివేసినా, స్పందించకపోయినా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా బెదిరిస్తారన్నార.
కుటుంబ సభ్యులకు హాని చేస్తామని, వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో బయటపెడతామని భయపెడతారన్నారు. సైబర్ నేరగాళ్లు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు, ఫేక్ ఫొటోలు, తప్పుడు రివ్యూలు, వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు.
కొన్ని సార్లు ఒకే గ్యాంగ్ పలు పేర్లతో వివిధ అకౌంట్లు నిర్వహిస్తూ బాధితులను మానసికంగా వేధిస్తోందని పేర్కొన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులను సంప్రదించాలన్నారు. మోసానికి గురైతే 1930 సైబర్ హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
