
- లోకేషన్ జన్నారంలో..
- కాల్స్ కాంబోడియా నుంచి..
- మంచిర్యాల జిల్లాలో పట్టుబడిన సైబర్ ముఠాపై దర్యాప్తు వేగవంతం
- ప్రధాన నిందితుడైన జాక్ కాంబోడియాలో ఉన్నట్లు గుర్తింపు
- లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్న పోలీసులు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్‌లో వెలుగు చూసిన సైబర్ నేరాలు మయన్మార్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్, కాంబోడియా దేశం వేదికగా జరుగుతున్నట్లు తేలింది. ఈ ముఠాను నడుపుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన పాలవలసల సాయికృష్ణ అలియాస్ జాక్ సైతం కాంబోడియాలోనే ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు అతడిని పట్టుకునేందుకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని గుర్తించిన పోలీసులు ఇటీవల నలుగురిని అరెస్ట్ చేయగా.. సాయికృష్ణతో పాటు మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన బోను జయవర్ధన్, సింహాద్రిలు పరారీలో ఉన్నారు.
చైనా ఎక్విప్‌మెంట్స్‌తో కాల్ డైవర్షన్
సైబర్ ప్రాడింగ్ కోసం ఈ ముఠా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా, ఒక వేళ లొకేషన్ ట్రేస్ చేసినా.. అసలు నేరస్తులు దొరకకుండా పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం చైనా నుంచి లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ కొని.. దాని ద్వారా కాల్స్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు ఓ ఆఫీసర్ తెలిపారు.
జన్నారంలో పట్టుబడిన నిందితులు సిమ్ బాక్స్‌లలో ఒకే సారి వందల సిమ్ కార్డులు వేస్తూ ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయితే... కాంబోడియాలోని వ్యక్తులు కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. టవర్ లోకేషన్ జన్నారంలోనే చూపించినప్పటికీ.. కాల్స్ మాత్రం కాంబోడియా నుంచి వస్తున్నాయి. జాక్ ముఠా యువకులకు డబ్బుల ఆశ చూపించి ఈ క్రైమ్‌లోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో తీగలాగితే...
ఢిల్లీలోని సౌత్ వెస్ట్ సైబర్ క్రైమ్ పీఎస్ పరిధిలో జూలై 14న ఓ సైబర్ ఫ్రాడ్ కేస్ నమోదు అయింది. సైబర్ నేరస్తులు వృద్ధ దంపతులకు ఫోన్ చేసి వారిని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరించి రూ.25 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించగా.. దంపతులకు వచ్చిన కాల్ సిగ్నల్ జన్నారంలో చూపించింది. దీంతో ఇక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. దాదాపు వారం రోజుల పాటు సెర్చ్ చేసి కిష్టాపూర్‌లో స్థావరాన్ని గుర్తించారు.
ఢిల్లీ పోలీసులు ఇటీవల మంచిర్యాలకు వచ్చి వివరాలు సేకరించారు. ఈ ముఠా నెల రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయలు దోచుకున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. జాక్‌కు సంబంధించిన ఓ అకౌంట్ ద్వారా గత ఆరు నెలల్లో రూ.50 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు ? రోజుకు ఎన్ని కాల్స్ చేశారు ? ఎంత మందిని మోసం చేశారు ? ఎవరెవరి బ్యాంక్ అకౌంట్లు వాడుకున్నారు ? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ముఠా రాచకొండ పీఎస్ పరిధిలో రూ.10 లక్షలు ప్రాడ్ చేసినట్లు కేసు నమోదు కాగా. తమిళనాడు కోయంబత్తూర్‌లోసైతం సైబర్ మోసానికి పాల్పడినట్లు మరో కేసు నమోదు అయింది.