
- రూ.1,576 కోట్లు కొట్టేసిన ఆర్థిక నేరగాళ్లు
- వార్షిక నివేదికలో సీపీ సీవీ ఆనంద్ వెల్లడి
- 2,249 కేసులు రిజిస్టర్.. 226 కేసులు సాల్వ్
- 2022లో పెరిగిన సైబర్ నేరాలు
- రూ.1,576 కోట్లు కొట్టేసిన ఆర్థిక నేరగాళ్లు
- వార్షిక నివేదికలో సీపీ సీవీ ఆనంద్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు : సిటీలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయి. ఈ ఏడాది నమోదైన 2,249 సైబర్ నేరాల్లో కేవలం 226 కేసులు మాత్రమే పోలీసులు ఛేదించారు. 112 బ్యాంక్ అకౌంట్స్‌లో ఉన్న రూ.33.11 కోట్లు ఫ్రీజ్ చేశారు. రూ.9.58 కోట్లు విలువ చేసే 27 ప్రాపర్టీస్ అటాచ్ చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక నేరాలు పెరిగాయి. 949 కేసులు నమోదు కాగా, రూ.1,576 కోట్లు ఆర్థిక నేరగాళ్లు కొట్టేశారు. ఇందులో 1,601 మందిని అరెస్ట్ చేశారు. చైన్ స్నాచింగ్‌లు, ప్రాపర్టీ క్రైమ్స్, భౌతిక దాడులకు సంబంధించిన కేసులు పెరిగిపోయాయని వార్షిక నివేదికలో సీపీ సీవీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జాయింట్ సీపీలు, ఐదు జోన్ల డీసీపీలు, ట్రాఫిక్, సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి ఇయర్ ఎండ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. గతేడాది మొత్తం 21,998 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 22,060 కేసులు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు.
భారీగా పెరిగిపోతున్న సైబర్ నేరాలు
సాధారణ నేరాలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. తీవ్రమైన నేరాలు, దోపిడీలు, హత్యలు భారీగా తగ్గాయని సీవీ ఆనంద్ చెప్పారు. రోజుకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైతే వాటిలో 20 సైబర్ క్రైమ్‌కు సంబంధించినవే అన్నారు. క్రిప్టో కరెన్సీ, యాప్స్, డార్క్ వెబ్‌సైట్స్ ద్వారా ఎక్కువ సైబర్ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో 10శాతమే ఛేదించామని చెప్పారు. మహేష్ కో–ఆపరేటీవ్ బ్యాంక్ సర్వర్ హ్యాకర్‌ని పట్టుకున్నామన్నారు. మత కల్లోలాలు సృష్టించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 94 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 86 డ్రగ్స్ కేసుల్లో 177 మంది పెడ్లర్స్, 932 మంది కస్టమర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ డిసౌజా, గోవా కింగ్‌పిన్ ఎడ్విన్, బోర్కర్, మురుగన్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నట్లు వెల్లడించారు.
ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వలేదు
బోనాలు, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి, రంజాన్, మిలాద్ ఉన్ నబి లాంటి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో పూర్తి చేశామని సీవీ ఆనంద్ తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, స్వాతంత్ర్య వజ్రోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయన్నారు. ప్రధాని మోడీ సహా వీవీఐపీలు పాల్గొన్న కార్యక్రమాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఏడాది 1,070 మంది బాధితుల ఫిర్యాదులను తానే స్వయంగా సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించానని స్పష్టం చేశారు.
రెండేండ్లలో నమోదైన కేసుల వివరాలు
కేసులు 2021 2022
ఐపీసీ, ఎస్ఎల్‌ఎల్ 19,007 19,809
భౌతిక దాడులు 2,133 2,181
ప్రాపర్టీ క్రైమ్స్ 2,417 3,094
మహిళలపై దాడులు, వేధింపులు 2,652 2,524
చిన్నారులపై అఘాయిత్యాలు 399 350
సైబర్ నేరాలు 2,066 2,249