రిసార్ట్ బుకింగ్​ పేరిట మోసం

రిసార్ట్ బుకింగ్​ పేరిట మోసం

బషీర్​బాగ్, వెలుగు: రిసార్ట్ బుకింగ్​పేరిట సైబర్ నేరగాళ్లు ఓ యువ ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేశారు. సికింద్రాబాద్ కు చెందిన 30 ఏళ్ల మహిళ ఈ నెల 2న ఆన్​లైన్ లో రిసార్ట్ బుకింగ్ కోసం వెతికింది. ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలలో ఉన్న ఓ రిసార్ట్ పేరిట స్కామర్స్ ఆన్​లైన్ లో కాంటాక్ట్ నంబర్ పెట్టారు. ఆ నంబర్​ను బాధితురాలు సంప్రదించి, రూ.4 వేలు బదిలీ చేసింది. 

కొద్దిసేపటికే స్కామర్స్ నంబర్ నుంచి రూ.39,900 క్రెడిట్ అయినట్లు ఆమెకు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే స్కామర్లు కాల్​చేసి టైపింగ్ ఎర్రర్ కారణంగా తమ అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయ్యాయని, తిరిగి వాపసు పంపించాలని నమ్మించారు. బాధిత మహిళ తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండానే రూ.35 వేలు బదిలీ చేసింది. 

ఇదే తరహాలో రూ.35 వేలు, రూ.20 వేలు, రూ.35 వేలను మళ్లీ పంపించింది. చివరిగా తన అకౌంట్ ను పరిశీలించగా, మొత్తం రూ.1.33 లక్షలు డెబిట్ అయినట్లు గుర్తించింది. ఆ తరువాత స్కామర్ల ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి, సైబర్ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది.