
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. సైబర్ నేరగాళ్లు రూ.707 కోట్లు కొల్లగొట్టారని, సైబర్‌క్రైమ్స్17.59 శాతం పెరిగినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలతో 2023 వార్షిక నేర నివేదికను శుక్రవారం విడుదల చేశారు. డీజీపీ ఆఫీస్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ డీజీలు సంజయ్ కుమార్ జైన్, మహేశ్ భగవత్, శిఖాగోయల్ ఐజీలు, గ్రేటర్ సీపీలతో కలిసి వివరాలు వెల్లడించారు. ‘‘కొత్త ఏడాదిలో మహిళా రక్షణ, సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ టార్గెట్‌గా కార్యాచరణ రూపొందిస్తాం. టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను మరింత బలోపేతం చేస్తాం” అని అన్నారు.
‘‘పోలీస్ స్టేషన్ స్థాయిలో సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతాం. చట్టానికి లోబడి పనిచేసేలా సిబ్బందిలో మార్పు తీసుకొస్తాం. ఈ ఏడాది1360 ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో టీన్యాబ్ ద్వారా 59 కేసులు నమోదు అయ్యాయి.182 మందిని అరెస్ట్ చేశాం. రూ.7.99 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం. రిపీటెడ్‌గా నేరాలు చేసే175 మందిపై పీడీ యాక్ట్ పెట్టాం. ఈ ఏడాది 232 కేసుల్లో కోర్టులు జైలు శిక్షలు విధించాయి’’అని డీజీపీ తెలిపారు.
నివేదిక ఆధారంగా మేడిగడ్డ బ్యారేజ్‌పై చర్యలు
సీఎం కాన్వాయ్ మూవ్‌మెంట్ సమయంలో సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. ‘‘ప్రజాప్రతినిధుల భద్రత కోసం వాహనాల కొనుగోలు ఉంటుంది. సీఎం భద్రత ఇంటెలిజెన్స్సెక్యూరిటీ వింగ్పరిధిలోనిది. 22 ల్యాండ్క్రూజర్ల కొనుగోలు వివరాలు మేము బహిర్గతం చేయలేం. రాష్ట్రంలో ల్యాండ్ ఇష్యూస్‌లో చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అంశంపై నిపుణుల కమిటీ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యేల కొనుగోలు, టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. టీఎస్‌పీఎస్‌సీ పేపర్స్ లీకేజీ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఛార్జ్‌షీట్స్ కూడా దాఖలయ్యాయి”అని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు.