మొన్న ఎస్బీఐ, నిన్న కిసాన్, నేడు ఆర్టీవో ఏపీకే ఫైల్స్.. కొత్తదారుల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

మొన్న ఎస్బీఐ, నిన్న కిసాన్, నేడు ఆర్టీవో ఏపీకే ఫైల్స్.. కొత్తదారుల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

 

  • మొన్న ఎస్బీఐ, నిన్న కిసాన్, నేడు ఆర్టీవో ఏపీకే ఫైల్స్​
  • వాట్సాప్, ఫేస్​బుక్, ఇతర సామాజిక మాధ్యమాలతో టార్గెట్​
  • ములుగు జిల్లాలో 65కిపైగా కేసుల నమోదు
  • సైబర్​ నేరాలపై అవగాహన పెంచుకోవాలంటున్న పోలీసు అధికారులు

ములుగు, వెలుగు :  సైబర్​నేరగాళ్లు కొత్తదారుల్లో డబ్బులు కాజేస్తున్నారు. గతంలో ఎస్బీఐ, కిసాన్​ సంస్థలను అడ్డం పెట్టుకొని ఏపీకే ఫైల్స్​ క్రియేట్ చేసిన నేరగాళ్లు ప్రస్తుతం రవాణా శాఖను టార్గెట్​ చేస్తున్నారు. వాట్సాప్ లలో డాట్ ఏపీకే ఫైల్స్​ను క్రియేట్ చేసి మెస్సేజ్ పంపిస్తే, తెలియని వారు ఆ లింక్ లను క్లిక్​ చేసి మోసపోతున్నారు. ప్రజలు అలెర్ట్​గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.  

కొత్తగా ఆర్టీవో ఏపీకే తో చోరీలు..

గతంలో జరిగిన సైబర్​ నేరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు సైబర్​ క్రైం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బ్యాంకులు ఓటీపీలు అడగవని, అలాంటి కాల్స్​ వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, సైబర్​ నేరస్తులు కొత్తదారుల్లో టార్గెట్​ చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్, యాప్​ల ద్వారా డబ్బులను కాజేస్తున్నారు. 

దీంతో ​పీఎం కిసాన్ యోజన ఏపీకే, ఎస్బీఐ యాప్​ల ద్వారా డబ్బులు కోల్పోతున్న వారు కంప్లెయింట్ చేయడంతో నేరగాళ్లు కొత్త విధానాన్ని అవలంభిస్తున్నారు. రోడ్​ట్రాన్స్​పోర్ట్​శాఖ కు సంబంధించిన ఆర్టీవో ఏపీకే ఫైల్ ను వాట్సాప్ లో సెండ్​ చేస్తూ హ్యాక్​ చేస్తున్నారు. వాట్సాప్​ ఓపెన్​ చేయగానే ఆర్టీవో ఆఫీస్​ జీవోవీటీ అని కనిపిస్తోంది. 

అందులో ట్రాఫిక్​ నిబంధనలు పాటించకపోవడం ద్వారా మీ వాహనంపై ట్రాఫిక్​ చాలన్​ ఇష్యూ అయ్యింది, చాలన్​ నెంబర్​ అంటూ ఒక నెంబర్​ పంపిస్తున్నారు. అది నిజమేనేమో అనే సందేహం వచ్చేలా మెస్సేజ్​వస్తోంది. ఈ లింక్​ను ఓపెన్​ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం అవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఫేస్​బుక్​లో అయితే ట్రేడ్​ బిజినెస్​ పేరిట ఆశ చూపి డబ్బులు లాగేస్తున్నారు. 

ములుగు జిల్లాలో రెండేళ్లలో మొత్తం 65 సైబర్​ క్రైం కేసులు నమోదయ్యాయి. 2024లో రూ.20.86లక్షలు రికవరీ కాగా, 2025 జూన్​ వరకు రూ.3.56 లక్షలు రిఫండ్​ అయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అందులో ఎక్కువ మొత్తంలో ఒక బాధితుడివి రూ.18లక్షలు, మరో బాధితుడివి రూ.34లక్షలు సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో కోల్పోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కంప్లెయింట్ ఆలస్యం చేయడంతో కేసులు దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. 

తెలియని మెస్సేజ్ లను  డిలీట్ చేయాలి.. 

సైబర్​ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. వాట్సాప్, ఫేస్​బుక్, ఇతర మాధ్యమాల ద్వారా నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. ఏపీకే ఫైల్స్​పై ఎవరూ క్లిక్​చేయొద్దు. చదువుకున్న వారు, ఉద్యోగస్తులే టార్గెట్ గా నేరగాళ్లు చాట్ చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు కోల్పోతే వెంటనే 1930 కు సమాచారం ఇవ్వాలి. ఆలస్యం అయితే రికవరీకి ఆస్కారం తక్కువగా ఉంటుంది. జిల్లాలో ప్రజలకు సైబర్​ నేరాలపై అవగాహన కల్పిస్తాం. - బి.నందిరాం నాయక్, డీఎస్పీ, సైబర్​ క్రైం, ములుగు

1930కి కాల్​చేస్తే రికవరీకి ఛాన్స్.. 

సైబర్​ వలలో చిక్కిన బాధితులు వెంటనే గుర్తించి నిమిషాల వ్యవధిలో టోల్ ఫ్రీ నెంబర్​ 1930 కు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులను సైబర్​ క్రైం ఆఫీసర్లు హోల్డ్​లో పెట్టే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సైబర్​ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 1930కి కాల్​ చేయగానే బాధితుడికి దగ్గర్లోని సైబర్​ కార్యాలయాలకు కనెక్ట్ అవుతుంది.

 వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు కోల్పోయిన డబ్బులు ఏ బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్​ఫర్​ అయ్యాయో తనిఖీ చేస్తారు. ఆన్​లైన్ ద్వారా ఆ అకౌంట్ ను హోల్డ్​లో పెట్టి విచారణ మొదలు పెడతారు. ప్రాసెస్ లో ఆ సొమ్ము తిరిగి బాధితుడికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.