- మ్యాట్రిమోనియల్ మాటున సైబర్ వల! అందమైన అమ్మాయిల ఫొటోలతో ఫేక్ ప్రొఫైల్స్
- విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల పేరిట ఆన్‌లైన్ డేటింగ్, సోషల్ మీడియాలో చాటింగ్
- క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఆశ పెడుతున్న సైబర్ నేరగాళ్లు
- అందినకాడికి దోచుకొని బ్లాక్ చేస్తున్న వైనం
ముషీరాబాద్‌లో నివాసం ఉంటూ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇంజినీర్‌గా పనిచేసే ఓ వ్యక్తి వివాహం కోసం ప్రముఖ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. అతడికి మరో మ్యాట్రిమోని ద్వారా ఓ యువతి పరిచయమైంది. కొన్ని రోజులు మాములుగానే మాట్లాడింది. ఈ క్రమంలోనే తాను క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి భారీ మొత్తంలో సంపాదించానని నమ్మించి, అతడిని కూడా ఇన్వెస్ట్ చేయమని సూచించింది. ఇలా లింక్‌లు పంపించి 29 విడతల్లో మొత్తం రూ.54 లక్షలు కొల్లగొట్టింది. చివరకు మోసం పోయానని గుర్తించిన సదరు ఇంజినీర్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్, వెలుగు : పెండ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించే వారిని టార్గెట్‌గా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి, అందమైన అమ్మాయిలు, అబ్బాయిల ఫొటోలతో ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నారు. ఆకట్టుకునే విధంగా స్టిల్స్, ఫొటో షూట్స్, వీడియోస్ తయారు చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. నకిలీ మోట్రిమోనియల్ సైట్లలో ఫొటోలు, వీడియోలు చూసి ఆసక్తి చూపిన వారితో వాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయం పెంచుకుంటున్నారు.
తర్వాత గిఫ్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో నమ్మించి లింక్‌లు పంపిస్తూ లక్షలు దోచేస్తున్నారు. అలాగే చాటింగ్, న్యూడ్ వీడియోస్ పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా గడిచిన నెల రోజుల్లోనే ఏకంగా15 మందిని మోసగించారు. దీంతో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో దొరికే ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్
సైబర్ నేరగాళ్లు హైటెక్ హంగులతో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లను రూపొందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దొరికే యువతీయువకుల ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకొని, వాటితో నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తున్నారు. విదేశాల్లోని మల్టీ నేషనల్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ఉద్యోగాలు చేస్తున్నట్లు లేదంటే మెడిసిన్ వంటి ఉన్నత విద్య చదువుతున్నట్లు చూపిస్తున్నారు. ఫొటో, వివరాలు చూసి పెండ్లికి ఆసక్తి చూపి ఎవరైనా యువకులు ఫోన్ చేస్తే వారితో అమ్మాయిలతో మాట్లాడించడం, చాటింగ్ చేయడం వంటివి మొదలు పెడతారు. తర్వత యువకుడి కుటుంబసభ్యుల వివరాలు సహా వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫ్రెండ్స్ లిస్ట్ ఆధారంగా ఆయా వ్యక్తుల అలవాట్లు, సామాజిక ఆర్థిక స్థోమతను గుర్తిస్తున్నారు. ఆ తర్వాత గిఫ్ట్‌లు, వ్యాపారాల్లో పెట్టుబడుల పేరిట మోసాలు చేయడం ప్రారంభిస్తున్నారు.
పెండ్లి చేసుకుందామని నమ్మించి...
ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున ఇండియాకు రాగానే పెండ్లి చేసుకుందామని యువకులను నమ్మిస్తున్నారు. పూర్తి నమ్మకం కుదిరాక.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులుపెడితే తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపెడుతున్నారు. ఈ పెట్టుబడులకు తాము గ్యారంటీ ఉంటామంటూ చెప్పి బ్యాంక్ అకౌంట్లు, ట్రేడింగ్‌కు సంబంధించిన వివరాలు అందిస్తున్నారు. ఇదంతా నిజమేనని నమ్మిన యువకుల ఫోన్లకు లింక్‌లు పంపి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. తర్వాత యువకులను నమ్మించేందుకు పెట్టుబడిపై కొంత లాభం వచ్చినట్లు చూపిస్తున్నారు. పెట్టుబడిని విత్‌డ్రా చేసుకుందామని యువకులు ప్రయత్నిస్తే.. ఇందుకు ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఇద్దరి పేరిట జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టొచ్చని నమ్మిస్తున్నారు. ఎవరికైనా అనుమానం వచ్చి గట్టిగా నిలదిస్తే వెంటనే సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసి తప్పించుకుంటున్నారు.
డబ్బుల గురించి మాట్లాడితే అనుమానించాలి
మ్యాట్రిమోని సైట్లలో పరిచయమైన వారు డబ్బు, పెట్టుబడుల గురించి మాట్లాడితే అనుమానించాలి. అనధికారిక వెబ్‌సైట్లు, వాట్సప్ లింక్‌ల ద్వారా పరిచయం అయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెండ్లి సంబంధాల కోసం చూసేటప్పుడు అవతలి వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆన్ లైన్ డేటింగ్, చాటింగ్ అంటేనే సైబర్ నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ అని గుర్తుంచుకోవాలి. – శివమారుతి, ఏసీపీ, సైబర్ క్రైమ్, హైదరాబాద్
