
- అవాస్తవాలు, వదంతులను నమ్మొద్దు
- వైరల్ చేసే వారిపై కంప్లయింట్ చేయండి
- సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
గచ్చిబౌలి, వెలుగు : సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అవి వాస్తవమో కాదో తెలుసుకోవాలని, గుడ్డిగా షేర్ చేయొద్దని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. హోక్స్ మెసేజ్ లను షేర్ చేయడం ద్వారా అవాస్తవాలను నమ్మడమే కాకుండా ఇతరులను తప్పుదోవ పట్టించిన వారవుతారని పేర్కొన్నారు. సుమారుగా 11 నెలల క్రితం ఫేస్బుక్ అకౌంట్ కలిగిన వ్యక్తి ‘పోలీసులంటే కూడా విలువలేకుండా పోయింది.. ఒక ఎమ్మెల్సీ కొడుకు తన కాళ్ళు పట్టుకుంటేనే ఎస్ఐ గారిని వొదిలేస్తాడంటా, పాపం ఎస్ఐని ఎలా కొట్టారో చూడండి’ అని ఒక వీడియోని పోస్ట్ చేశాడు. కాగా సదరు వీడియోని ప్రస్తుతం కొందరు పనిగట్టుకొని తిరిగి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో లో చెప్పిన విధంగా ఆ సంఘటన తెలంగాణలో జరగలేదన్నారు. అప్పట్లో కొందరు వ్యక్తులు మద్యం మత్తులో అటవీ శాఖ అధికారులపై దాడి చేయగా, దాడి చేసిన వ్యక్తులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని అరెస్టు కూడా చేశారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలను నమ్మవద్దని, ఇతరులకు కూడా షేర్ చేయవద్దని సీపీ ప్రజలకు సూచించారు.
ప్రజలు, నెటిజెన్స్ కు సూచనలు
- సోషల్ మీడియాలో ప్రచారమయ్యే అసత్య ప్రచారాలు, వదంతులు, వీడియోలను ప్రజలు నమ్మవదు. వాటిని నమ్మి ఇతరులకు పంపించకూడదు.
- చూడగానే నమ్మలేని విధంగా ఉండే సందేశాలు చాలాసార్లు నిజమైనవి కావనేది పోలీసుల పరిశీలనలో తేలింది.
- రెచ్చగొట్టే సందేశాల్లో అర్ధసత్యాలు, అసత్యాలు ఉంటాయి. వాటిని చదివి ఆవేశపడకండి. నిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయకండి.
- వేరే ప్రదేశంలో జరిగిన సంఘటనల ఫొటోలు, వీడియోలు మన దగ్గర జరిగినట్లు వ్యాప్తి చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఉదాహరణకు పక్క దేశంలో జరిగిన ప్రమాదం హైదరాబాద్‌లో జరిగినట్లు వదంతులు వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ప్రచారం చేస్తున్నారు.
- పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు నగరంలో తిరుగుతున్నాయి అని, వాట్సాప్‌లో షేర్ అవుతున్నవి నకిలీ వీడియోలు. వేరే వీడియోలను ఎడిట్ చేసి సృష్టించిన ఈ వీడియోలు నిజం కాదు. వాటిని ఎవ్వరు కూడా నమ్మొదు.
- గుర్తు తెలియని వ్యక్తుల నుంచి, పెద్దగా పరిచయం లేని వాళ్ల నుంచి వచ్చే సందేశాలు అవాస్తవాలు కావచ్చు. వాటిని వెంటనే నమ్మి ఫార్వర్డ్ చేయవద్దు.
- వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా చాలా సార్లు వదంతులు వ్యాప్తి చెందే అవకాశముంది. ఎక్కువ మంది నుంచి ఒకటే సమాచారం వస్తే దాన్ని నిజం అనుకోకండి. అలా వచ్చిన వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసి వారిని భయభ్రాంతులకు గురిచేయొద్దు.
వదంతులు వ్యాప్తి చేస్తే శిక్షార్హులు
-అసత్యాలను నమ్మకండి. వాటిని ప్రచారం చేయకండి. అలా చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారెవరైనా చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించం. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో నాయకులు, అధికారులు, సెలబ్రెటీలపై అసత్య ప్రచారాలు చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అసత్య ప్రచారాలు చేసే వారిపై సైబరాబాద్ పోలీసుల వాట్సాప్ నంబర్ 9490617444 నంబర్ కు ఫిర్యాదు చేయొచ్చు. ‑ సైబరాబాద్ సీపీ సజ్జనార్