సైబరాబాద్ ఎస్సై రాజేందర్ సస్పెన్షన్

సైబరాబాద్ ఎస్సై రాజేందర్ సస్పెన్షన్

గచ్చిబౌలి, వెలుగు: డ్రగ్స్ కేసు నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను పక్కదారి పట్టించి, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్సై రాజేందర్​ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పటికే రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించగా, తాజాగా అతన్ని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు రాజేందర్ ను కస్టడీ కోరుతూ రాయదుర్గం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అతన్ని రెండు రోజుల కస్టడీకి కూకట్​పల్లి కోర్టు అనుమతించింది. 

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ తన టీమ్ తో కలిసి గతకొన్ని రోజుల క్రితం ముంబైలో ఓ డ్రగ్స్ రాకెట్​ను  చేధించారు. అక్కడ నైజీరియన్ వద్ద దొరికిన 1.700 గ్రాముల డ్రగ్స్ ను పక్కదారి పట్టించాడు. అనంతరం ఆయన ఆ డ్రగ్స్ ను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తూ నార్కొటిక్ అధికారులకు పట్టుబడ్డాడు. కాగా, రాజేందర్ గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్​లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెన్షన్ కు గురయ్యాడు. అనంతరం హైకోర్టులో స్టే తెచ్చుకొని తిరిగి విధుల్లో చేరాడు. తాజాగా డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడి మరోసారి సస్పెండ్ అయ్యాడు.