ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు అమ్ముతున్న దొంగలు అరెస్ట్

ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు అమ్ముతున్న దొంగలు అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ఢిల్లీలో దొంగిలించిన కార్లకు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సిటీకి తీసుకొచ్చి అమ్ముతున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఈ కేసు వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఆఫీసులో వెల్లడించారు. అత్తాపూర్​లోని​అహ్మద్ రెసిడెన్సీలో ఉండే మహ్మద్ హజార్ జావీద్(34) ఇంటర్ వరకు చదివాడు. 2016లో ఖతర్​లో ఉండే తన సోదరి దగ్గరకు వెళ్లాడు. అక్కడి సూపర్ ​మార్కెట్లు, రెస్టారెంట్లలో లేబర్​గా పనిచేసి 2020లో తిరిగి సిటీకి వచ్చాడు. తర్వాత జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇదే టైమ్ లో ఓఎల్​ఎక్స్​లో కార్ ఫర్ సేల్ యాడ్ చేసి అందులో ఉన్న ఫోన్ నంబర్​కు కాంటాక్ట్ అయ్యాడు.  

యూపీలోని సంబల్ ప్రాంతానికి చెందిన గులామ్ నబీ అతడికి పరిచయమయ్యాడు. ఢిల్లీ, యూపీలో కారును తక్కువ రేటుకు కొని సిటీలో ఎక్కువకు అమ్ముకోవచ్చని జావిద్​కు గులాం నబీ చెప్పాడు. తర్వాత జావిద్, నబీ ఢిల్లీలో కలుసుకున్నారు. నబీ రూ. 4లక్షలకు ఇన్నోవా కారును జావిద్ కు అమ్మి.. వెహికల్ డాక్యుమెంట్లు ఇచ్చాడు. జావిద్ ఢిల్లీ నుంచి ఆ కారును సిటీకి తీసుకొచ్చి ఇక్కడ రూ. 6.70 లక్షలకు అమ్మేశాడు. లాభం ఎక్కువ రావడంతో ఇలా ఢిల్లీ నుంచి నబీ దగ్గర కార్లను కొని జావిద్ సిటీలో అమ్మే వాడు. ఈ క్రమంలో నబీ కొట్టేసిన కార్లకు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి తనకు అమ్ముతున్నట్లు జావిద్ తెలుసుకున్నాడు. తర్వాత అత్తాపూర్​కు చెందిన మహ్మద్ జహీర్(21), బండ్లగూడకు చెందిన మహ్మద్ అమన్ ఖాన్(23)తో కలిసి జావిద్ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఈ ముగ్గురు కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ నబీ దొంగలించిన కార్లను తీసుకుని సిటీకి వచ్చేవారు. ఫేక్ డాక్యుమెంట్లతో వాటిని ఇక్కడ అమ్మేవారు. ఇలా ఇప్పటివరకు ఢిల్లీ నుంచి 14 వెహికల్స్ ను తీసుకొచ్చి సిటీలో అమ్మారు. 4 నెలల కిందట జావిద్​, జహీర్​ ఢిల్లీ నుండి కార్లు తీసుకొని సిటీకి వస్తుండగా నాగ్ పూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్లను అక్కడే వదిలేసి జావిద్​, జహీర్​ పరారై సిటీకి చేరుకున్నారు. మరో కారు డ్రైవ్ చేస్తున్న  ముజాహిద్ పోలీసులకు పట్టుబడ్డాడు. జావిద్, జహీద్ జరిగిన విషయాన్ని ప్రధాన నిందితుడు గులాం నబీకి చెప్పారు. ఇప్పటి వరకు వీరిపై ఢిల్లీలో 16 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 28న శంషాబాద్ ఎస్ వోటీ, రాజేంద్రనగర్ పోలీసులు హిమాయత్ సాగర్ రోడ్ లో తనిఖీలు చేస్తున్నారు. అదే టైమ్ లో దొంగిలించిన కారులో వస్తున్న జావిద్, జహీర్, అమన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 2 కోట్ల 30 లక్షల విలువైన 15 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నబీ పరారీలో ఉన్నట్లు సీపీ  తెలిపారు.