1500 కోట్ల చీటింగ్.. 10 లక్షల మందిని ముంచారు

1500 కోట్ల చీటింగ్.. 10 లక్షల మందిని ముంచారు
  • 20 కోట్ల రూపాయలు ఫ్రీజ్.. 24 మందిని అరెస్ట్
  • అరెస్టయిన నిందితుల్లో ముగ్గురు ప్రభుత్వ టీచర్లు
  • సైబరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్: ప్రజల అమాయకత్వాన్ని.. తొందరగా.. సులభంగా డబ్బు సంపాదించాలన్న సామాన్యుల బలహీనతలను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇండస్ వివా మనీ సర్క్యులేషన్ స్కీం పేరుతో దేశ వ్యాప్తంగా 10 లక్షల మందిని మోసం చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ముఠాలోని 24 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు కంపెనీ అకౌంట్లో ఉన్న 20 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించి స్కాం వివరాలు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన కంపెనీ 2014 లో ఈ స్కీం స్టార్ట్ చేసిందన్నారు. మనీ సర్క్యులేషన్ పేరుతో మాయమాటలు చెప్పడంతో దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ఇందులో డబ్బులు కట్టారని, సుమారు 1500 కోట్ల మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. గతంలో ఆమ్వే కంపెనీలో పని చేసిన వారు, ఇతర మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల్లో పని చేసినవారు ఈ స్కీంలో ఉన్నారని, ఇందులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు గవర్నమెంట్ టీచర్లని కూడా అరెస్ట్ చేశామన్నారు. వారు స్కూల్ కి లీవ్ పెట్టి ఇందులో పని చేసినట్లు గుర్తించామన్నారు. పదిరోజుల క్రితం తమకు వచ్చిన కంప్లెయింట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టగా ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చిందన్నారు. ఇండస్ వివా ప్లాన్ అనే పేరుతో ఈ స్కీంని మొదలుపెట్టారని చెప్పారు. ఈ స్కీమ్ లో చేరే వారు ముందుగా రూ.12,500 కట్టి మెంబర్షిప్ తీసుకోవాలని, పాయింట్ వాల్యూ ప్రకారం ఆదాయం వస్తుందని అందరినీ నమ్మించారు. ఇద్దరిని జాయిన్ చేయిస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు. లక్షా 50 వేలు కడితే ప్రెసిడెంట్ మెంబర్షిప్ ఇస్తారు. ఇందులో 25 రకాల వస్తువులు ఇస్తారు. ఎక్కువ మందిని జాయిన్ చేయిస్తే లెవెల్స్ ని బట్టి క్యాష్ రివార్డ్, లాప్ టాప్స్, గోవా ట్రిప్స్, మలేసియా ట్రిప్స్, దుబాయ్ ట్రిప్స్, అమెరికా ట్రిప్, బెంజ్ కార్, డైమండ్ రింగ్ ఇస్తామని మోసం చేశారు.’’ అని సీపీ సజ్జనార్ వివరించారు. స్టార్ హోటల్స్ లో మీటింగ్స్ పెట్టి జనాలను ఎలా మోసం చేయాలనే ట్రైనింగ్ ఇచ్చేవారని, హెల్త్, బ్యూటీ, డైట్ ప్రొడక్టులను ఇస్తామని మోసం చేశారని తెలిపారు. పిల్లలు కాని వాళ్లకి కూడా పిల్లలు అవుతారని, లావు ఉన్నవాళ్లు స్లిమ్ అవుతారని ఫేక్ ప్రొడక్ట్స్ ఇచ్చి మోసం చేశారని సీపీ సజ్జనార్ వివరించారు.

మల్టి లెవెల్ మార్కెటింగ్ మోసాల్లో మహిళలను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు

మల్టి లెవెల్ మార్కెటింగ్ మోసాల్లో మహిళలను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని, ఎన్రోల్మెంట్ స్కీమ్స్ అన్ని మోసపూరితమైనవేనని సీపీ సజ్జనార్ వెల్లడించారు. గతంలో ఎన్నో మల్టి లెవెల్ మార్కెటింగ్ మోసాలు జరిగినా ప్రజలు తిరిగి మళ్ళీ మోసపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ఇలాంటి స్కీమ్స్ పేరుతో వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. వీరు ఇచ్చే వస్తువలకు కూడా ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఈ స్కీమ్ లో కట్టి మోసపోయిన వారు.. తెలంగాణలో లక్షకు పైగా బాధితులు ఉన్నారని, ఇతర దేశాల్లో కూడా ఈ కంపెనీకి బ్రాంచీలున్నాయని ఆయన తెలిపారు. ప్రజలందరూ ఇలాంటి స్కీమ్స్ తో జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

 

 

 

 

ఇవి కూడా చదవండి

కేసీఆర్ కుటుంబంపై సర్వత్రా వ్యతిరేకత ఉంది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ.. మోసాలు చేస్తున్న మాజీ రంజీ ప్లేయర్ అరెస్ట్

మళ్లీ మోగుతున్న వాట్సప్ ‘ప్రైవసీ’ గంటలు..

ప్రియుడితో పెళ్లికోసం చిన్నారిని ఎత్తుకెళ్లిన యువతి