సైబర్ మోసాల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బు రీఫండ్

సైబర్ మోసాల్లో బాధితులు  పోగొట్టుకున్న డబ్బు రీఫండ్

గచ్చిబౌలి, వెలుగు:  సైబర్ మోసాల బారిన పడి డబ్బు కోల్పోయిన బాధితులకు ఆ మొత్తాన్ని సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి.. రీఫండ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు 39 సైబర్ క్రైమ్ కేసులను ట్రేస్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. బాధితులు పోగొట్టుకున్న  రూ. కోటి 49 లక్షల 41 వేల మొత్తాన్ని రికవరీ చేసి వారి అకౌంట్లలో జమ అయ్యేలా చేశారు. సైబర్ మోసాలపై అలర్ట్ గా ఉండాలని.. సైబర్​ చీటింగ్​ జరిగితే 1930 నంబర్​కు కాల్ చేస్తే  వెంటనే సంబంధిత అకౌంట్లకు జరిగిన లావాదేవీలను నిలిపివేస్తామని సైబర్​ క్రైమ్​ పోలీసులు తెలిపారు.

రీ ఫండ్ ఇలా..

సైబర్ మోసాల బారిన పడిన  బాధితుడు/ఫిర్యాదుదారుడు 457 సీఆర్పీసీ కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి.  పోలీసుల అభిప్రాయం తీసుకొని, సరైన ప్రక్రియను అనుసరించిన తర్వాత నిలిపివేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంది. కోర్టు ఆదేశాలు అందిన తర్వాత పోలీసు అధికారి బ్యాంకులకు సమాచారం అందిస్తారు, తద్వారా అనుమానితుడి ఖాతాల్లో నిలిపివేసిన మొత్తాన్ని బ్యాంకులు బాధితుల ఖాతాలకు బదిలీ చేస్తాయి.