తెలంగాణ పర్యాటక శాఖలో డిస్కౌంట్ దందా..ప్రియుడి ఖాతాలో కోటి రూపాయలు వేసిన మహిళా ఉద్యోగి

తెలంగాణ పర్యాటక శాఖలో డిస్కౌంట్ దందా..ప్రియుడి ఖాతాలో కోటి రూపాయలు వేసిన మహిళా ఉద్యోగి

పర్యాటక శాఖలో ‘డిస్కౌంట్’ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. దీంతో శాఖ ఆదాయాని గండిపడుతుండగా.. ఉద్యోగుల జేబులు మాత్రం నిండుతున్నాయి. పర్యాటకులకు ఇచ్చే రాయితీ సౌకర్యాన్ని ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుని అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యాటకుల నుంచి టికెట్లకు పూర్తి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది.. రికార్డుల్లో మాత్రం వారికి రాయితీ ఇచ్చినట్లు చూపిస్తూ ఆ డబ్బును జేబులో వేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం, ఆడిటింగ్ లోపాలతో ఈ దందా నిరాటంకంగా సాగుతున్నది.

ప్రియుడి కోసం రూ. కోటి పక్కదారి

గతంలో ఓ మహిళా ఉద్యోగి ఏకంగా కోటి రూపాయలకుపైగా నిధులను పక్కదారి పట్టించిన ఘటన సంచలనం సృష్టించింది. రూ.1.05 కోట్లను తన ప్రియుడి బ్యాంకు అకౌంట్​కు మళ్లించినట్లు ఎంక్వైరీలో తేలింది. సదరు ఉద్యోగినిపై కేసు నమోదు చేయడంతో పాటు డబ్బుల రికవరీకి ఎండీ వల్లూరు క్రాంతి ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత విచారణ ఎంతవరకు వచ్చింది.. ఎన్ని నిధులు రికవరీ చేశారనేదానిపై స్పష్టత లేదు. అంతేకాకుండా, టూరిజం హోటల్స్​లో స్వైపింగ్ మిషన్ల ద్వారా రూ.80 లక్షలు కాజేసినా.. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నది తెలియజేయడం లేదు. ఇలాంటి ఎన్నో అక్రమాలు జరుగుతున్నా..అధికారులు దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి.