ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు.
ధనుర్మాసంలో స్వామివారిని నిత్యం మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. డిసెంబర్ 16 మధ్యాహ్నం1:23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభంకానున్నాయని పంచాగం ద్వారా తెలుస్తుంది. ఈ దనుర్మాసం2026 జనవరి 14 వరకు ఉంటుంది. అందుకే డిసెంబర్ 17 నుంచి ధనుర్మాస పూజ కైంకర్యాలు నిర్వహిస్తారు.
కలియుగ దేవుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. ఏడుకొండలపై వేంచేసిన .. శ్రీ వేంకటేశ్వరస్వామిని నిత్యం సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. కౌసల్య, సుప్రజా రామ సంధ్య ప్రవతథే అంటూ శ్రీవారిని మేల్కొల్పు ప్రారంభం అవుతుంది. కానీ ధనుర్మాసంలో ( 2025 డిసెంబర్ 17 నుంచి 2026 జనవరి 14) వరకు మాత్రం సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేసి శ్రీవారిని మేల్కొలుపుతారు ఆలయ అర్చకులు. తిరిగి జనవరి 15వ తేదీ సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు.
శ్రీవారిని తన భర్తగా భావించి.. పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన ముప్పై పాసురాలనే గోదాదేవి పాసురాలు అంటారు. ధనుర్మాసంలో ఒక్కో పాసురాన్ని ముప్పై రోజుల పాటు పాటిస్తూ శ్రీవారిని మేల్కొలుపుతారు అర్చకులు. ధనుర్మాసం నెలరోజులపాటు నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వపత్రాలను ఉపయోగిస్తారు.
శ్రీవారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి కాకుండా శ్రీకృష్ణ భగవానికి ఈ నెల రోజులపాటు నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజానివేదనలు నిర్వహిస్తారు.
పరమభక్తురాలైన గోదాదేవి తరఫున బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు మోహిని అవతారం సందర్భంగా శ్రీనివాసునికి శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు... చిలుకలతో పాటు గరుడ సేవలో అలంకరించే తులసి మాలలు స్వామి వారికి సమర్పిస్తారు.
ధనుర్మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాసురలను పఠించడం అనతికాలంగా వస్తున్న సంప్రదాయం. తిరుప్పావై ను ఏకాంతంగా బంగారు వాకిలి దగ్గర పఠించనున్నారు వేదపండితులు. ధనుర్మాసంలో స్వామివారికి ప్రతిరోజూ శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను అలంకరిస్తారు.
