Telangana Tourism: వెయ్యేళ్ల వినాయకుడు.. తెలంగాణలో పంటపొలాల మధ్య గణపేశ్వరుడు.. ఎక్కడంటే..!

Telangana Tourism: వెయ్యేళ్ల వినాయకుడు.. తెలంగాణలో పంటపొలాల మధ్య గణపేశ్వరుడు.. ఎక్కడంటే..!

గణపేశ్వరాలయం.. కూసుమంచికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం రాష్ట్రంలోనే అతిపెద్దది. ఎత్తు ఏడు అడుగులు, ఓరుగల్లు రామప్ప ఆలయం కంటే ఇక్కడి శివలింగం పెద్దదని పరిశోధకులు చెబుతుంటారు. అంతేకాకుండా ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శిల్పకళ, బండరాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చిన విధానం, కాకతీయుల నిర్మాణ శైలి.. ఒక్కటేమిటి అన్నీ అద్భుతాలే.  ఇంతటి చరిత్ర కలిగిన గణపేశ్వరుడి దేవాలయం గురించి తెలుసుకుందాం. . .! 

కొన్నేళ్ల క్రితం ఈ ఆలయం పంట పొలాల మధ్య శిథిలావస్థలో ఉండేది. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయి ఉండేవి. 2001లో అప్పటి కూసుమంచి సర్కిల్ ఇన్స్​ పెక్టర్ సారు వీరప్రతాప్​ రెడ్డి ఆలయాన్ని బాగుచేయించారు. అప్పటి నుంచి ఆలయంలో పూజలు, కల్యాణమహోత్సవాలు జరుగుతున్నాయి. పండుగ రోజుల్లో.. విశిష్టత కలిగిన రోజుల్లో  భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  భక్తులు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. 2002లో ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది.

గణపతిదేవుని హయాంలో.... ఈ ఆలయాన్ని 12, 13 శతాబ్దాల్లోకట్టించి ఉంటారని చరిత్రకారుల అంచనా. గణపతిదేవుని గురువు విశ్వేశ్వరశర్మ నిర్వహణలో దీన్ని కట్టించారని చెబుతారు. ఇంటర్ లాకింగ్ విధానం ద్వారా పెద్ద పెద్ద బండ రాళ్లను ఒక దానిపై ఒకటి పేర్చారు. ఆ రాళ్లపై శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయాన్ని ఎత్తు నుంచి చూస్తే లింగాకారం లో ఉంటుంది. ఆలయం.. పానపట్టం ఆకృతిలో, గోపురం.. లింగాకృతిలో కనిపిస్తుంది.భారతీయ శిల్పకళా సంప్రదాయంలో విశిష్టమైన 'వేసర శిల్పరీతి లో కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. సూర్యకిరణాలు గర్భాలయంలోని శివలింగాన్ని తాకేలా ఆలయాన్ని నిర్మించారు.

చెక్కు చెదరని కళాకృతులు

 కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలను వాళ్ల పేరుతోనే పిలిచేవాళ్లు. గణపతిదేవుని కాలంలో  కట్టినందుకు ఈ ఆలయాన్ని గణపేశ్వరాలయంగా పిలుస్తున్నారు.  

►ALSO READ | రాగి రెసిపీ: స్వీట్.. ఖీర్.. తింటే ఉపయోగాలు ఇవే..!

అప్పట్లో  కట్టించిన ఆలయాలన్నీ కాలక్రమేణా ధ్వంసమైనా... గణపేశ్వరాలయం మాత్రం పునాదుల నుంచి మూలవిరాట్ వరకు చెక్కుచెదరకుండా ఉంది. దీని సమీపంలోనే త్రికూటాలయ పద్ధతిలో కట్టిన 'ముక్కంటేశ్వరాలయం' మాత్రం ఎక్కువభాగం శిధిలమైంది. ఇందులోని మూడు లింగాలను గుప్త నిధుల కోసం కొందరు తవ్వారు. దాంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆదాయం వస్తుండటంతో గణపేశ్వరాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చిన అధికారులు, పక్కనే ఉన్న ముక్కంటేశ్వరాలయాన్ని పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. 


సౌకర్యాలు కల్పించాలి

భక్తుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఉత్సవాలు జరుపుతున్నారు.  మాన్యం భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. గణపేశ్వరాలయానికి 97 ఎకరాలు, ముక్కంటేశ్వరాలయానికి 17 ఎకరాలు మాన్యంగా ఉండేది. ఈ వివరాల రికార్డుల్లో ఉన్న భూములు మాత్రం లేవు. ఆలయంలో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుచేయాలి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు నిర్మిస్తే భక్తులకు ఉపయోగపడతాయి.

ఆదాయం ఆలయానికే..

పండుగల సమయాల్లో, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల సేవా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం హుండీ ఆదాయం ఏటా రూ. 5లక్షల వరకు ఉంటుంది. ఏళ్ల నుంచి పడావు పడటంతో ఏటా వస్తున్న ఆదాయంతో కొద్దికొద్దిగా ఆలయ అభివృద్ధి పనులు జరిపిస్తున్నాం. మిగిలిన పనులు కూడా ప్లాన్ ప్రకారం చేపడుతున్నాం. ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా ఆలయ అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలి.

డెవలప్ చేయాలి

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. మంచి నీరు. .విశ్రాంతి గదులు ఉంటే సౌకర్యంగా ఉంటుంది.  సాయంత్రం వరకు ఉండాలనుకునే భక్తులకు ఇక్కడ సౌకర్యాలు లేవు. పిల్లలు.. లేడీస్..మహిళలు.. వృద్దులు ...ఆలయంలో వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ముక్కంటేశ్వరాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అక్కడికి వెళ్లేందుకు దారి కూడా లేదు. చుట్టూ పొలాలు ఉన్నాయి. ప్రభుత్వం కలుగజేసుకొని ఆలయాన్ని అభివృద్ది చేస్తే ఈ దేవాలయానికి ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

ఈ ఆలయాన్ని 12, 13 శతాబ్దాల్లో నిర్మించి ఉంటారని చరిత్రకారుల అంచనా. భారతీయ శిల్పకళా సంప్రదాయంలో విశిష్టమైన వేసర శిల్పరీతి'లో ఆలయం నిర్మితమైంది. సూర్యకిరణాలు గర్భాలయంలోని శివలింగాన్ని తాకుతుంటాయి. కాకతీయ రాజు గణపతిదేవుని కాలంలో కట్టినందుకు ఈ ఆలయాన్ని గణపేశ్వరాలయంగా పిలుస్తున్నారు.

ఎలా వెళ్లాంటే..

ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారిలో 23 కిలోమీటర్లు ప్రయాణిస్తే కూసుమంచికి. -చేరుకోవచ్చు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఆలయం  ఉంది. హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్లు ఉంటుంది.

–వెలుగు,లైఫ్​–