
- టీజీఐఐసీ, ఎస్సీఎస్సీతో సమన్వయ సమావేశం
- రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ అడ్డంకులు తొలగించడంపై చర్చ
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. కమిషనరేట్ ఆఫీస్‌లో బుధవారం టీజీఐఐసీ, ఎస్సీఎస్సీ అధికారులతో సంయుక్తంగా ట్రాఫిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
జాయింట్ సీపీ డాక్టర్ గజరావు భూపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్ కె.శశాంక , ఎస్సీఎస్సీ సీఈవో నవేద్ ఖాన్, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా రోడ్ల విస్తరణ పనులు, ట్రాఫిక్‌కు అడ్డంకులు తొలగించడంపై చర్చించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పీక్, నాన్-పీక్ సమయాల్లో వాహనాల రాకపోకలను విశ్లేషించి, ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.
ముఖ్యంగా, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విద్యుత్ స్తంభాలు, నీటి పైప్లైన్లను తరలించాలని నిర్ణయించారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికి వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం అవసరాన్ని జాయింట్ సీపీ గజరావు భూపాల్ వివరించారు.