వీడియో: కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో!

వీడియో: కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో!

చేవెళ్ల: తాగి బండి నడపొద్దని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా జనం వినట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాళ్లు ప్రమాదంలో పడటంతో పాటు ఇతరులకు హాని కలిగిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ నెల నాలుగో తేదీ చేవెళ్లలోని ఇబ్రహీంపల్లి గేట్ దగ్గర ఓ వ్యక్తి మద్యం తాగి డేంజర్ గా బైక్ నడుపుతూ కింద పడ్డాడు. అదే రూట్ లో వెళ్తున్న వాహనదారులు ఆ మందుబాబుని లేపారు. తిరిగి మళ్లీ డ్రైవ్ చేస్తూ రోడ్డు మధ్యలోకి వెళ్లి అడ్డదిడ్డంగా బండి నడిపి ఇతర వాహనాలకు మళ్లీ మళ్లీ ఇబ్బంది కలిగించాడు. చివరికి వెళ్లి ఓ కారును గుద్దేశాడు. మద్యం మత్తులో బండి నడుపుతున్న అతడి వద్ద హెల్మెట్ ఉన్నా కూడా పెట్టుకోలేదు. దానిని బండి మిర్రర్‌‌కు తగిలించాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఘటన విజువల్స్‌ను ‘కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’ అన్న ట్యాగ్‌ లైన్‌తో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12.59కి ట్విట్టర్‌‌లో పోస్ట్ చేస్తే, సాయంత్రం నాలుగున్నరకే 15 వేల మందికిపైగా చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఫన్నీ ఫెలో.. లక్కీగా బతికాడు’, ‘మద్యపానం నిషేధం చేయమంటే ప్రభుత్వం వినదు. మద్యం తాగి వెహికల్స్ ని నడపవద్దు అంటే ప్రజలు వినరు, ఎవడి గోల వాడిది’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.