జగిత్యాల స్టూడెంట్​ అకాడమీ సొసైటీలో పోలీసుల సోదా

జగిత్యాల స్టూడెంట్​ అకాడమీ సొసైటీలో పోలీసుల సోదా

ముంబై, ఢిల్లీ కేంద్రంగా ఫేక్​ సర్టిఫికెట్ల వ్యాపారం

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న ఫేక్​ సర్టిఫికెట్ల దందాను సైబరాబాద్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు బహిర్గతం చేశారు. లోకల్​పోలీసుల సహకారంతో శుక్రవారం అర్ధరాత్రి స్టూడెంట్ అకాడమీ సొసైటీలో సోదాలు నిర్వహించారు. సైబరాబాద్​ టాస్క్​ఫోర్స్​ ఎస్​ఐ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. సొసైటీ నిర్వాహకుడు ఖలీల్​ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ఈ సోదాల్లో జార్ఖండ్, యూపీ, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన మొత్తం 18 యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్స్​ను స్వాధీనం చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్​ సర్టిఫికెట్​ కోసం రూ.15 నుంచి 20వేలు, ప్రొఫెషనల్​ కోర్సు సర్టిఫికేట్​ కోసం రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు అక్కడ దొరికిన రికార్డులను పరిశీలిస్తే తెలుస్తున్నది. డిస్టెన్స్​ కోర్సుల్లో ఎగ్జామ్స్​ రాయించిన 150 ఆన్సర్​ షీట్స్​ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సొసైటీలోని సర్టిఫికెట్స్, హాల్​ టికెట్స్, కంప్యూటర్స్, సెల్​ఫోన్స్, ఆధార్​కార్డులు, డ్రైవింగ్​ లైసెన్సులు, ప్రింటర్, స్టాంపులను సీజ్​ చేశారు. హైదరాబాద్​లో దొరికిన ఫేక్​ స్టడీ సర్టిఫికెట్స్​ ఆధారంగా తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తున్నది. ఈ దందా ముంబై, ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నట్టు పోలీసులు ఓ అంచనాకొచ్చారు. సోదాలకు వచ్చిన  టాస్క్​ఫోర్స్​ పోలీసులకు సొసైటీ నిర్వాహకుడు ఖలీల్​ సహకరించలేదు. దుకాణం తెరిచేందుకు తాళాలివ్వకపోవడం, కంప్యూటర్​ పాస్​వర్డ్స్​ చెప్పక పోవడంతో సోదాలు 4గంటలు లేట్​గా ప్రారంభమై.. శనివారం తెల్లవారుజాము దాకా కొనసాగాయి.