
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. మంగళవారం మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర్లోని కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌పై అనుచితంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదులు రావడంతో సెర్చెస్ చేసినట్లు తెలిపారు. సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. కంప్యూటర్స్, ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్‌లు సీజ్ చేశారు. ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. ఆఫీస్‌ను సీజ్ చేశారు.
పోలీసులను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ స్టాటజీ టీమ్ హెడ్‌గా సునీల్ కనుగోలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ 2024 గ్రూప్‌లో మెంబర్‌గా ఉన్నారు. రెండు ఫేస్‌బుక్ పేజీలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలతో పాటు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా పోస్టింగ్స్ చేశారని సామ్రాట్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వీటితోపాటు మరో నాలుగు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. దీంతో పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా లొకేషన్ గుర్తించి సోదాలు చేశారు. ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న కాంగ్రెస్ నేతలు మల్లురవి, షబ్బీర్ అలీ, అనీల్‌యాదవ్, మహేష్‌గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో షబ్బీర్ అలీ, మల్లు రవి వాగ్వాదానికి దిగారు. సోదాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వారెంట్స్, నోటీసులు చూపించాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీలు, నోటీసులు చూపిన తర్వాత విచారణ జరపాలని స్పష్టం చేశారు. మఫ్టీలో వచ్చింది పోలీసులేనా అని ప్రశ్నించారు. తమ అనుమానాలకు సమాధానం చెప్పిన తర్వాతే సెర్చెస్ చేయాలని అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మల్లురవి, షబ్బీర్‌అలీ, అనీల్‌యాదవ్, మహేష్‌గౌడ్‌లను అరెస్టు చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
నేడు నిరసనలకు రేవంత్ పిలుపు
కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయంపై పోలీసుల దాడి, ఆఫీసును సీజ్ చేయడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వార్ రూమ్ లో పార్టీ వ్యవహారాలు జరుగుతాయని, ఇక్కడ పోలీ సుల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసుల దాడికి నిరసనగా బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళన చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని కోరారు.
ఎఫ్ఐఆర్ లేకుండా సోదాలా?
కాంగ్రెస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఆఫీసును కుట్ర పూరితంగా సీజ్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి, అనిల్ యాదవ్ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఎఫ్ఆర్ఐ లేకుండా సునీల్ ఆఫీసును ఎలా తనిఖీ చేస్తారని నిలదీశారు. ఆఫీసుపై పోలీసుల దాడిని, సీజ్ చేయడం పట్ల నిరసన తెలిపారు. జూబ్లీహిల్స్ లోని సునీల్ కార్యాలయం వద్ద సోదాల సందర్భంగా పోలీసులతో పలువురు నేతలు వాగ్వాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.