లక్షల్లో లాభాలంటూ కోటిన్నర కొట్టేసిన్రు: సైబర్​నేరగాళ్ల బాధితులు

లక్షల్లో లాభాలంటూ కోటిన్నర కొట్టేసిన్రు: సైబర్​నేరగాళ్ల బాధితులు

బషీర్ బాగ్, వెలుగు: ఇన్వెస్ట్​మెంట్​పేరుతో సిటీకి చెందిన ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. కోటిన్నర కొట్టేశారు. అమీర్​పేటకు చెందిన ఓ వ్యక్తితో ఆన్​లైన్​లో పరిచయం పెంచుకున్న సైబర్ నేరగాళ్లు యూట్యూబ్​లో వీడియోలకు లైక్స్, షేర్ కొడితే డబ్బులు వస్తాయని ఆశ చూపారు. మొదట అతడికి కొంత డబ్బు చెల్లించి నమ్మకం కలిగేలా చేశారు. తర్వాత కొన్నిరోజులకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రూ.లక్షల్లో లాభాలు వస్తాయని చెప్పారు. నమ్మిన బాధితుడు రూ.70 లక్షలను సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్​కు ట్రాన్స్​ఫర్ చేశాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తుల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్​ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

గోల్డ్ ట్రేడింగ్​అని చెప్పి.. 

గోల్డ్ ట్రేడింగ్​లో ఇన్వెస్ట్ చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో పని చేస్తున్న ఓ అధికారిని ఇటీవల ఆన్​లైన్​లో కొందరు సంప్రదించారు. మొదట రూ.50 వేలు ఇన్వెస్ట్ చేసిన అధికారికి రూ.2 లక్షలు చెల్లించారు. నమ్మకం కుదరడంతో అధికారి పలు దఫాలుగా రూ.73 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత నుంచి లాభాలు చెల్లించకపోగా మరికొంత డబ్బు ఇన్వెస్ట్​ చేయాలని ఒత్తిడి చేయడంతో రైల్వే అధికారి సిటీ సైబర్​ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రెండు ఘటనలపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టామని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.