ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో రూ.3.72 కోట్లు లూటీ.. కూకట్‌‌పల్లి వ్యాపారిపై టోపీ

ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో  రూ.3.72 కోట్లు లూటీ.. కూకట్‌‌పల్లి వ్యాపారిపై టోపీ

హైదరాబాద్‌‌, వెలుగు: స్టాక్‌‌ మార్కెట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ రీసెర్చ్‌‌ పేరుతో కూకట్‌‌పల్లి దేవిస్థాన్‌‌ హోమ్స్‌‌కు చెందిన వ్యాపారవేత్త లక్ష్మణ్‌‌ (49) నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 3.72 కోట్లు కొట్టేశారు. ‘నాదిర్ వర్మ’ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌‌లో లక్ష్మణ్‌‌కు సైబర్ నేరగాడు పరిచయం అయ్యాడు. స్టాక్ మార్కెట్ రీసెర్చ్ ప్రొఫెసర్‌‌గా పరిచయం చేసుకున్నాడు. క్వాలిఫైడ్ ఇన్‌‌స్టిట్యూషనల్ బయ్యర్స్ ట్రేడింగ్‌‌లో పెట్టుబడి పెడితే 100 శాతం లాభం వస్తుందని లక్ష్మణ్‌‌ను నమ్మించాడు.

‘ఓఆర్‌‌బీఐఎమ్’ పేరుతో ఫేక్ లింక్ పంపి.. 20 రోజుల వ్యవధిలో రూ.3.93 కోట్లు డిపాజిట్ చేయించాడు. మొదట రూ.50 వేలు పెట్టించి 5 శాతం ప్రాఫిట్ చూపి నమ్మకం కలిగించిన నేరగాళ్లు.. రూ.21 లక్షలు మాత్రమే విత్‌‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ నెల 22న మిగతా మొత్తం విత్‌‌డ్రా చేయాలని లక్ష్మణ్‌‌ ప్రయత్నించగా, అదనపు డిపాజిట్, వివిధ ట్యాక్సులు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన లక్ష్మణ్ మోసపోయినట్లు గుర్తించాడు. ఈ నెల 27న టీజీసీఎస్‌‌బీకి ఫిర్యాదు చేశాడు.