హైదరాబాద్: ఈజీ మనీ, అక్రమ సంపాదనకు అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఇన్నాళ్లు బ్యాంక్ కేవైసీ అప్‌డేట్, పార్ట్‌టైం ఉద్యోగాలు, స్టాక్ మార్కెట్ టిప్స్, పెట్టుబడి పేరుతో వివిధ రకాలుగా నేరాలకు పాల్పడిన కేటుగాళ్లు ఇప్పుడు సరికొత్త రూట్‌ను ఎంచుకున్నారు. లేటేస్ట్‌గా సైబర్ మోసగాళ్లు భూ రికార్డులపై కన్నేశారు. భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటూ ఫేక్ లింకులు పంపి అక్రమంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ మోసగాళ్లు కొత్తగా భూ రికార్డులపై కన్నేశారని.. ప్రజలెవరూ ఆ స్కామ్‌లో చిక్కుకోవద్దని సూచించారు. ఫేక్ వెబ్‌సైట్లలో ల్యాండ్ స్కామ్‌లు జరుగుతున్నాయని.. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మీ భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్‌డేట్ చేయండంటూ సైబర్ మోసగాళ్లు ఫేక్ లింకులు పంపుతున్నారని.. ఆ లింకులు క్లిక్ చేస్తే మీ వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయని హెచ్చరించారు. అధికారిక ల్యాండ్ పోర్టల్స్‌లో మాత్రమే వివరాలు నమోదు చేయాలని అలర్ట్ చేశారు.
మోసగాళ్లకు మీ ఆధార్, ఫోన్ నంబర్, ఓటీపీలు చెప్పొద్దని సూచించారు. మీ భూమి వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే చెక్ చేసుకోవాలని.. ఫేక్ ల్యాండ్ వెబ్ సైట్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్లలో డేటా ఎంటర్ చేస్తే పెద్ద మోసం జరుగుతుందని.. భూమి వివరాలు తెలుసుకోవడానికి సరైన వెబ్‌సైట్స్‌ను మాత్రమే ఆశ్రయించాలని వివరించారు. తెలంగాణలో భూభారతి, ఆంధ్రప్రదేశ్‌లో మీ భూమి వెబ్ సైట్లలలో మాత్రమే భూమికి సంబంధించిన వివరాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
