గుజరాత్, రాజస్థాన్​లో ఆగని వర్షాలు.. వాయుగుండంగా మారిన బిపర్ జాయ్

గుజరాత్, రాజస్థాన్​లో ఆగని వర్షాలు.. వాయుగుండంగా మారిన బిపర్ జాయ్

జైపూర్/అహ్మదాబాద్ : గుజరాత్​లో తీరం దాటిన బిపర్​జాయ్ తుఫాన్ మరింత బలహీనపడి వాయుగుండంగా మారింది. దీనిప్రభావంతో ప్రస్తుతం ఈస్ట్ రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలి, జలోర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు జిల్లాల్లో స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎస్​డీఆర్ఎఫ్) బృందాలు 3‌‌‌‌‌‌‌‌0 మందిని రెస్క్యూ చేసి కాపాడాయి. అజ్మీర్​లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అల్పపీడనం మధ్య, పశ్చిమ రాజస్థాన్ నుంచి తూర్పు వైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు.

జలోర్, సిరోహి, బార్మర్, పాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది గ్రామాలతో కనెక్టివిటీ తెగిపోయింది. కరెంట్ సప్లై నిలిచిపోయింది. ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలోర్ జిల్లా భిన్మల్ టౌన్​లోని ఓడ్ బస్తీ నుంచి 39 మందిని ఎస్​డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేశాయి. 

బుధవారం నాటికి తగ్గనున్న తీవ్రత

అజ్మీర్​లోని జవహర్​లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ (జేఎల్ఎన్) హాస్పిటల్​లో నీళ్లు చేరాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్థోపెడిక్​ వార్డులో వరద నీరు చేరడంతో 18 మంది రోగులను మరో రెండు వార్డుల్లోకి షిఫ్ట్ చేశామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్ తెలిపారు. హాస్పిటల్ కారిడార్ ద్వారా నీళ్లు లోపలికి వచ్చాయన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇలాగే నీళ్లు లోపలికి వస్తాయని వివరించారు. నీళ్లన్నీ ఎత్తి పోశామన్నారు. టోంక్, బుండి, సవాయి మాధోపూర్, జైపూర్, పాలి, భిల్వారా, చిత్తోర్‌‌‌‌గఢ్‌‌‌‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం నాటికి అల్పపీడన ప్రభావం తగ్గుతుందని వివరించారు.

నార్త్​ గుజరాత్​లో 24 గంటలుగా కుండపోత

నార్త్ గుజరాత్​పై బిపర్ జాయ్ తుఫాన్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అల్పపీడనం కారణంగా బనస్కాంత జిల్లాలోని చాలా గ్రామాలు నీట మునిగాయి. ధనేరా మండలం తీవ్రంగా ప్రభావితమైంది. జడియా గ్రామంలో 20 ఆవులు నీళ్లల్లో కొట్టుకుపోవడంతో చనిపోయాయి. అల్వాడ గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న బొలేరో, ఎకో కారులోని ఏడుగురిని ఎన్​డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. బొలేరోలోని నలుగురు సురక్షితంగా బయటపడగా.. ఎకో కారులోని నలుగురిలో ముగ్గురిని ఒడ్డుకు చేర్చగా.. డ్రైవర్ గల్లంతయ్యాడు. సౌరాష్ట్ర రీజియన్, గుజరాత్‌‌‌‌లోని వివిధ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో బనస్కాంత, సబర్​కాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.