రాజస్థాన్​లో భారీ వర్షాలు

రాజస్థాన్​లో భారీ వర్షాలు
  • తుఫాను ప్రభావం జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాలపైనే ఎక్కువ
  • 24 గంటల పాటు హై అలర్ట్​: ఐఎండీ

జైపూర్/అహ్మదాబాద్: గుజరాత్​ను వణికించిన బిపర్​జాయ్ తుఫాన్.. ఇప్పుడు రాజస్థాన్​పై ప్రతాపం చూపిస్తున్నది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌‌లోని పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్​లోని జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. తుఫాను అల్పపీడనంగా మారుతున్నది. పాలి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్​డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. బార్మర్​ జిల్లాలోని నాలుగైదు చిన్న ఆనకట్టలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. 

పలుచోట్ల కుండపోత..

రాజస్థాన్​లోని చాలా ఏరియాల్లో గడిచిన 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిశాయని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. జలోర్​లో 456 మిల్లీ మీటర్లు, మౌంట్​అబులో 360, చితల్​వానాలో 338, జస్వంతపురలో 332, రాణివాడలో 322, షేగంజ్​లో 315, సమర్​పూర్​లో 270, రాణిలో 249 మి.మీ. వర్షపాతం రికార్డైందన్నారు. రానున్న 24 గంటల్లో ఈస్ట్, వెస్ట్ రాజస్థాన్, వెస్ట్ మధ్యప్రదేశ్​లో మోస్తరు వర్షాలు పడ్తాయన్నారు.

గుజరాత్​లో..

నార్త్ గుజరాత్​లోని చాలా చోట్ల గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని ఐఎండీ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గుతున్నదని, సహాయక చర్యలు స్పీడప్ చేశారని వివరించారు. బనస్కాంత, పటాన్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని వేలాది మందిని సేఫ్​ ప్లేసుకు తరలించామన్నారు. అమీర్​గఢ్ మండలంలో ఆదివారం సాయం త్రం వరకు 206 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది.  కచ్​లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పోసినాలో 151, దంతివాడలో 150, పాలన్​పూర్​లో 136, రాధాపూర్​లో 125 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది.