నార్త్ ఐలాండ్‭ను వణికిస్తున్న గాబ్రియెల్ తుఫాన్

నార్త్ ఐలాండ్‭ను వణికిస్తున్న గాబ్రియెల్ తుఫాన్

న్యూజిలాండ్‭లోని నార్త్ ఐలాండ్‭ను గాబ్రియెల్ తుఫాన్ వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ వర్షాలతో ఐలాండ్‭లోని కొన్ని ప్రాంతాలు చల్లాచెదురయ్యాయి. నార్త్ ల్యాండ్, ఆక్లాండ్, కోరమాండల్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వేలాది మంది ప్రజలు విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దాదాపు 15వేల మంది పవర్ లేక చీకటిలో మగ్గుతున్నారు. కోరమాండల్, గిస్బోర్న్‭లోని కొంతమంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. ఇక రెండు రోజుల పాటు అత్యవసర సేవలు మినహా, అన్నింటిని మూసివేస్తున్నట్లు ఆక్లాండ్ కౌన్సిల్ ప్రకటించింది. 

తుఫాన్ కారణంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను మూసివేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇక ఆఫీసులకు వెళ్లేవారు ఇంటి నుంచే పనిచేయాలని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్ హిప్ కిన్స్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ప్రజలెవరూ బయటికి రావద్దని సూచించారు. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాలను హిప్ కిన్స్ పరిశీలించారు. రాబోయే రోజుల్లో వర్ష ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని హిప్ కిన్స్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించారు.