ఏపీకి  మిచాంగ్’ తుఫాను ముప్పు  .. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి  మిచాంగ్’ తుఫాను ముప్పు  .. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • అప్రమత్తమయిన ప్రభుత్వం
  • రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే

అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం తుఫానుగా మారనుంది. నెల్లూరు,-మచిలీపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ  నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో  మూడు రోజుల పాటు  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో సముద్ర తీరంలో అలలు ఎగసిపడతాయని, 100 కిమీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. తుఫాను పరిస్థితులపై ఏపీ సీఎం వైయస్. జగన్మోహాన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు,  నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావారి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున  విడుదలచేశారు.

చెన్నైలోనూ భారీ వర్షాలు

తుఫాను కారణంగా తిరువళ్లురు, మైలదుత్తురై, వేలూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పెరంబూర్, తంజావూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నై, కాంచీపురం, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, చెంగల్పట్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విల్లుపురం, కళ్లకురిచిలో భారీ  వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

పలు రైళ్ల రద్దు.. 

తుఫాను నేపథ్యంలో డిసెంబర్‌ 3 నుంచి 6వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. 140కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.