 
                                    - సిద్దిపేట జిల్లాలో 2515 ఎకరాల్లో పంట నష్టం
- మెదక్‌లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం
- లబోదిబోమంటున్న రైతులు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: మొంథా తుపాన్మెతుకుసీమ రైతాంగాన్ని ఆగమాగం చేసింది. సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కారణంగా చేర్యాల, మద్దూరు, అక్బర్పేట భూంపల్లి, చిన్నకోడూరు, నంగునూరు, దౌల్తాబాద్, బెజ్జంకి, కోహెడ, అక్కన్నపేట, జగదేవ్‌పూర్ మండలాల్లో వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని 10 మండలాల్లో 89 గ్రామాల్లోని 1666 మంది రైతులకు సంబంధించి 2515 ఎకరాల్లో పత్తి, వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మోయ తుమ్మెద వాగు, పిల్లి వాగు, పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
పిల్లి వాగు ఉధృతికి తంగళ్లపల్లి శనిగరం మధ్య బ్రిడ్జి కొట్టుకుపోయింది. మోయ తుమ్మెద వాగు ఉధృతికి దేవక్కపల్లి, వరికోలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పిల్లి వాగు ఉధృతి కారణంగా గుగ్గిళ్ల ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం కుప్పలు నీటిలో మునిగిపోయాయి. పిడుగుపాటుకు గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత భూమయ్య గేదె మృతి చెందింది.
హుస్నాబాద్ లో భారీ నష్టం
మొంథా తుఫాను వల్ల హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ నష్టం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కోహెడ మండలంలో 460, అక్కన్నపేట మండలంలో 476, హుస్నాబాద్ మండలంలో 200 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. గురువారం ఒక్కరోజే హుస్నాబాద్ మండలంలో 296, అక్కన్నపేట మండలంలో 241, కోహెడ మండలంలో 135 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీగా పంటలకు నష్టం జరగడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పర్యటించి అన్నదాతలకు భరోసా ఇచ్చారు.
హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ధాన్యం మురికి కాల్వలోకి కొట్టుకపోవడంతో మహిళా రైతు ఆవేదనను ఎవరూ ఆపలేకపోయారు. అక్కడికి వచ్చిన కలెక్టర్ హైమావతి కాళ్లపై పడి తనను ఆదుకోవాలని వేడుకొంది. హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు అమ్మకానికి వచ్చిన ధాన్యం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. నీళ్లలో కొట్టుకు పోయిన ధాన్యాన్ని రైతులు చేతులతో పట్టుకొని గంపల్లో వేసుకోవడం చూపర్లను కలిసివేసింది. అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగు వద్ద నవ దంపతులు గల్లంతయ్యారు.
మెదక్జిల్లాలో..
వారం రోజుల నుంచే రైతులు వరి కోసి పాపన్నపేట మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే ప్రదేశాని వడ్లు చేర్చారు. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షానికి అక్కడ ఆరబోసిన ధాన్యం అంతా తడిసి ముద్దయింది. మూడు రోజుల పాటు తడిగా ఉండడంతో పలు కుప్పల్లో వడ్లు మొలకలు వచ్చాయి. అకాల వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గొట్టిముక్కుల,శివ్వంపేటలో భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయింది. భీమ్లా తండా, సీతారాం తండాలో 40 మంది రైతులు ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయాయి.
ఆయా రైతులు కూలీలను పెట్టి కొట్టుకపోయిన వడ్లను సేకరించారు. వడ్లలో కలిసిన మట్టిని తొలగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ లో సైతం పెద్ద మొత్తంలో వడ్లు తడిసిపోయాయి. పొలాల్లో వడ్ల కుప్పల చుట్టూ నీరు చేరాయి. ఆ నీటిని తొలగించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొల్చారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద కూడా చాలా వడ్లు తడిసిపోయాయి.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల పరిధిలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. కంది, మునిపల్లి, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్, అందోల్, కంగ్టి మండలాల్లో వరి, పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. వడ్లు నానిపోయి రంగు మారి పోవడంతో దిక్కులేని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పంట నష్టం కింద పరిహారంగా ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని బాధిత రైతులు కోరుతున్నారు.
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ: వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మండలంలోని బస్వాపూర్, పోరెడ్డిపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను, కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
వరదల ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. హుస్నాబాద్ పరిధిలో రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. హుస్నాబాద్‌లో పర్యటించాలని సీఎంను కోరినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఆర్డీవో రామ్మూర్తి, ఎంపీడీవో కృష్ణయ్య, ఏవో సతీశ్, ఏఎంసీ చైర్పర్సన్నిర్మల, వైస్చైర్మన్తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు ధర్మయ్య, మాజీ సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు.

 
         
                     
                     
                    