తెలంగాణలో మొంథా కల్లోలం..మునిగిన ఊర్లు,రాకపోకలు బంద్.. ఇవాళ(అక్టోబర్ 30) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణలో మొంథా కల్లోలం..మునిగిన ఊర్లు,రాకపోకలు బంద్.. ఇవాళ(అక్టోబర్ 30) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్
  • వణికిన వరంగల్​, జనగామ, సిద్దిపేట, కరీంనగర్​, నాగర్​కర్నూల్​ జిల్లాలు
  • పలు జిల్లాలకు ఫ్లాష్​ ఫ్లడ్స్​ ముప్పు... హైదరాబాద్​లో రోజంతా ముసురు
  • సూర్యాపేట జిల్లాలో చెట్టు కూలి ఒకరి మృతి
  • ఖమ్మం జిల్లాలో కొట్టుకపోయిన డీసీఎం వ్యాన్​.. డ్రైవర్​ గల్లంతు
  • వరంగల్​ జిల్లా కల్లెడలో 38 సెంటీమీటర్ల వర్షపాతం
  • నాగర్​కర్నూల్​లో ఐదు గంటల్లోనే 21 సెంటీమీటర్ల వాన
  • అప్రమత్తమైన అధికారులు.. సహాయ చర్యల్లో నిమగ్నం
  • నేడూ భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్​ అలర్ట్​
  • ఏపీ అతలాకుతలం.. కూలిన పోతులూరి బ్రహ్మంగారి ఇల్లు

హైదరాబాద్/నెట్​వర్క్​, వెలుగు:  రాష్ట్రంలో మొంథా తుఫాన్​ బీభత్సం సృష్టించింది. మంగళ వారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలతో ముంచెత్తింది. మొదట దక్షిణాది జిల్లాలను.. ఆ తర్వాత ఉత్తరాది జిల్లాలను వణికించింది. హైదరాబాద్​లో బుధవారం అర్ధరాత్రి వరకు రికాం లేకుండా ముసురు పడింది. ముఖ్యంగా వరంగల్​, హనుమకొండ, నాగర్​కర్నూల్​, జనగామ, సిద్దిపేట, కరీంనగర్​, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను తుఫాన్​ ఆగం చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఊర్లకు ఊర్లనే ముంచేసింది. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.

 వరంగల్ ​ట్రైసిటీతోపాటు కరీంనగర్, హుజూరాబాద్​లో వందలాది కాలనీలు నీటమునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరి బియ్యం, బట్టలు, సామగ్రి తడిసిపోయాయి.  కాజ్​వేలు కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో కొన్ని వందల ఊర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాల పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది.తాటికోలు వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తుండడంతో  విద్యార్థులు పాఠశాల నుంచి బయటికి రాలేకపోయారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర ఘటన స్థలానికి చేరుకొని తాడు సాయంతో  500 మంది స్టూడెంట్లను సురక్షితంగా దగ్గర్లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ కు తరలించారు.  

దిశ మార్చుకొని..

అటు ఏపీతోపాటు ఇటు తెలంగాణలోనూ మొంథా తుఫాన్​ కల్లోలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తీరాన్ని దాటిన తుఫాన్​.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి.. తెలంగాణ మీదుగా దిశ మార్చుకుని ముందుకు కదులుతున్నది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తెలంగాణ, చత్తీస్​గఢ్​ పరిసరాలకు ఆనుకుని ఉంది. ఒడిశాలోని మల్కాన్​గిరి, తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, చత్తీస్​గఢ్​లోని జగ్దల్​పూర్​ మధ్యే ఆ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీంతో దాని ప్రభావం గురువారం కూడా ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సిరిసిల్ల, వరంగల్, యాదాద్రి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్​ జిల్లాలకు ఫ్లాష్​ఫ్లడ్స్​ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రమాదం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 

కల్లెడలో 38 సెంటీమీటర్లు

మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లారేవరకు నాగర్​కర్నూల్​, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, మహబూబ్​నగర్​, వికారాబాద్​, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నాగర్​కర్నూల్​లో కేవలం ఐదు గంటల వ్యవధిలోనే 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్​కర్నూల్​ జిల్లా ఆమ్రాబాద్​లో 19, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం రికార్డయింది.  ఒకట్రెండు జిల్లాలకు వార్నింగ్​లతో మొదలైన తుఫాన్​ బీభత్సం.. ఆ తర్వాత పలు జిల్లాలకు ఫ్లాష్​ ఫ్లడ్​ వార్నింగ్స్​తో పాటు 8 నుంచి 10 జిల్లాలకు రెడ్​ అలర్ట్స్​ ఇచ్చే వరకు వెళ్లింది. ముఖ్యంగా వరంగల్​, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్​, మహబూబాబాద్​ జిల్లాల్లో చిన్నపాటి ప్రళయాన్నే సృష్టించింది.  వరంగల్​ రైల్వే స్టేషన్​ నీట మునిగింది. వరంగల్​ జిల్లా కల్లెడలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 37.1 సెంటీమీటర్లు, వరంగల్​ జిల్లా రెడ్లవాడలో 32.6, కాపులకనపర్తిలో 31.4, ఉరుస్​లో 30.1, వర్ధన్నపేటలో 29.5, సంగెంలో 29సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.    

చెట్టు కూలి ఒకరు మృతి..  వాగులో కొట్టుకపోయి ఒకరు గల్లంతు.. 

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్లలో చెట్టు కూలి.. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ (45) మృతి చెందాడు. తానంచర్లలో మెడికల్ షాప్ వెళ్తుండగా వర్షాలకు ఒక్కసారిగా చెట్టు కూలి మీద పడడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. ఆ వాగు ప్రవాహంలోనే లోలెవల్ వంతెనను దాటే ప్రయత్నంలో డీసీఎం వ్యాన్​ కొట్టుకుపోయింది. డ్రైవర్ మురళి కూడా డీసీఎం వ్యాన్​తో పాటే కొట్టుకుపోయినట్లు తెలుస్తున్నది. నాగర్ కర్నూల్ జిల్లా చంద్రవాగులో 10 బర్రెలు, తాడూరు మండలం గోవిందాయపల్లి వద్ద 12 గొర్రెలు కొట్టుకుపోయాయి. లింగాల మండలం అవుసలికుంట-అంబటిపల్లి మధ్య ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఒకరిని స్థానికులు తాళ్ల సాయంతో రక్షించారు. 

ప్రాజెక్టులకు భారీగా వరద

నాగార్జునసాగర్‌‌ రిజర్వాయర్ కు వరద ఉధృతి పెరగడంతో బుధవారం రాత్రి  4 గేట్లను ఎత్తి 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద పెరగడంతో కృష్ణా నది పరివాహ ప్రాంతాల ప్రజలను  అప్రమత్తం చేశారు.  కేతేప‌‌ల్లి మండ‌‌ల ప‌‌రిధిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండ‌‌లా మారింది. ఏడుగేట్లను ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుద‌‌ల చేస్తున్నారు. కరీంనగర్​ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ లోకి మోయతుమ్మెద వాగు, మిడ్ మానేరు, కాకతయ మెయిన్ కెనాల్ నుంచి కలిపి 18,277 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ఆరు గేట్లు ఎత్తారు. కామారెడ్డి జిల్లాలోని  నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 2 గేట్లు ఎత్తారు. నాగిరెడ్డిపేట మండలం  పోచారం ప్రాజెక్టు, జుక్కల్ మండలంలోని కౌలాస ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టుకులోకి 11877 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 14 నెంబర్ గేటును 2 మీటర్లు ఎత్తి 9649 క్యూసెక్కులను బయటికి వదులుతున్నారు. సింగూర్ ప్రాజెక్టు గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గా భవాని మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

హైదరాబాద్​లో పొద్దున్నుంచీ వానే

హైదరాబాద్​ ప్రజలు బుధవారం పొద్దున్నే వానతోనే నిద్ర లేచారు. అర్ధరాత్రి వరకు ముసురు కొనసాగింది. ఈ చోటు ఆ చోటు అనే తేడా లేకుండా సిటీ వ్యాప్తంగా ముసురు కమ్మేసింది. ముషీరాబాద్​లో 4.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కంటోన్మెంట్​లో 4.1, బౌద్ధనగర్​లో 4, ఓయూలో 4, మెట్టుగూడలో 3.9, ఈదిబజార్​లో 3.9, బతుకమ్మకుంటలో 3.8, అల్కాపురిలో 3.8, అల్వాల్​లో 3.7, కుత్బుల్లాపూర్​లో 3.5, మారేడుపల్లిలో 3.5ఉప్పల్​లో 3.4, హయత్​నగర్​లో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గురువారం కూడా సిటీలో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఏపీ అతలాకుతలం

ఏపీలో తుఫాన్​ ధాటికి పైకొస నుంచి కిందకొస వరకు వర్షాలు దంచికొట్టాయి. నదులు ఉగ్రరూపాన్ని దాల్చి ప్రవహించాయి. శ్రీకాకుళంలో బాహుదా, నంద్యాలలో కుందూ, అనకాపల్లిలో శారద నదులు, ఎన్టీఆర్​ జిల్లాలో నల్లవాగు ఉధృతంగా ప్రవహించాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ తుఫాన్​ తీవ్రత అధికంగా ఉన్నట్టు అక్కడి అధికారులు చెప్పారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన మట్టి మిద్దె కూలింది. భారీ వర్షాల ధాటికి శ్రీశైలం, హైదరాబాద్​ రహదారిపై వరద ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి.