 
                                    - వాతావరణ శాఖ వెల్లడి
హైదరాబాద్, వెలుగు:మొంథా తుఫాన్ ముప్పు తప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురవడంతో గురువారం కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు. ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్స్సైతం జారీ చేశారు. అయితే అదృష్టవశాత్తు గురువారం ఉదయానికి తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది.
నాలుగైదు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు తప్ప పెద్ద వానలేమీ పడలేదు. మొంథా తుఫాన్ బుధవారం సాయంత్రానికే వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణ చత్తీస్‌గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది. అది గురువారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మరింత బలహీనపడింది. ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ రెండు కలిసి మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్‌గఢ్ ప్రాంతంలో శుక్రవారం అల్పపీడనంగా మరింత బలహీనపడనుంది.
దీంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. చిన్న చిన్న జల్లులు తప్ప, పెద్ద వర్షాలేమీ ఉండవని తెలిపింది. హైదరాబాద్సిటీలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయని చెప్పింది. ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచుతో పాటు మబ్బు పట్టి ఉంటుందని పేర్కొంది.
కాగా, గురువారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా నిర్మల్‌జిల్లా భైంసాలో 2.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆదిలాబాద్జిల్లా ఇచ్చోడలో 2, పొచ్చరలో 1.8, నిర్మల్‌జిల్లా వానల్‌పహాడ్‌లో 1.7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

 
         
                     
                     
                    